తెలుగువారి ఠీవి.. వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి పదవి సహా ఆయన్ను వరించిన హోదాలెన్నో
కేంద్రమంత్రిగా, బీజేపీ అధ్యక్షుడిగా రాణింపు
దేశంలోని ప్రతిజిల్లాలో పర్యటించిన బహుదూరపు బాటసారి
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. విద్యార్థి రాజకీయాల నుంచి ఉపరాష్ట్రపతి దాకా సుదీర్ఘకాలం దేశ ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను దేశ అత్యున్నత రెండో పౌరపురస్కారానికి ఎంపిక చేసింది. 75 ఏళ్ల వెంకయ్యనాయుడు తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, ఉపరాష్ట్రపతిగా విభిన్నహోదాల్లో పనిచేశారు. అనుపమాన వాగ్ధాటితో ఆసేతుహిమాచలం అభిమానధనాన్ని సొంతం చేసుకున్న తెలుగునేత ఈయనే. దేశంలో ఉన్న అన్ని జిల్లాలనూ కనీసం ఒక్కసారైనా చుట్టేసి ఈ దేశం మట్టివాసనను ఆఘ్రాణించిన బహుదూరపు బాటసారి కూడా. 2017 నుంచి 2022 మధ్యకాలంలో భారత 13వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యనాయుడు వాజ్‌పేయీ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగానూ పనిచేశారు. 2014 నుంచి 2017 వరకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నప్పుడు 2002 నుంచి 2004 మధ్యకాలంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సేవలందించారు.
మూడు భాషల్లో ప్రసంగ చాతుర్యం : 1949 జులై 1న నెల్లూరు జిల్లా చవటపాలెంలో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అంతా తెలుగు మాధ్యమంలో సాగినప్పటికీ స్వయంకృషితో మాతృభాషతోపాటు హిందీ, ఇంగ్లిష్‌లో అనర్ఘళంగా ప్రసంగించే ప్రావీణ్యాన్ని గడించారు. మూడు భాషల్లోనూ అంత్యప్రాసలతో హాస్యాన్ని రంగరించిన ఆలోచనాత్మక ప్రసంగం చేయడం ఆయనకే చెల్లు. దక్షిణాది నుంచి రాజకీయంగా ఎదిగినా ఉత్తరాది నాయకులతో సమానంగా దేశ రాజధానిలో గుర్తింపుపొందిన విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. అలుపులేకుండా నిరంతరం పనిచేయడం, పయనించడం, ప్రసంగించడం ఆయనకు ఇష్టమైన కార్యాలు. ఎంత ఎత్తుకు ఎదిగినా గ్రామీణ వేష, భాషలను వీడని వ్యక్తిత్వం వెంకయ్యనాయుడు ప్రత్యేకం. ప్రతి మాటలో, చేతలో కనిపించే సరళత, సౌమ్యత, స్పష్టత ఆయన్ను విశిష్టవ్యక్తిగా నిలిపాయి. సుదీర్ఘ రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప ఎవ్వరితోనూ వ్యక్తిగత విభేదాలు లేని అజాతశత్రువు. ప్రతిపక్షాల నుంచి కూడా గౌరవం పొందిన కొద్దిమంది నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ఉపరాష్ట్రపతి హోదాలో రాజ్యసభాధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వహించిన ఆయన పెద్దల సభకు సమయం నేర్పారు. సమావేశాలు జరిగే సమయంలో సభాకార్యకలాపాలు నడిచిన తీరు గురించి నిమిషాలతో సహా ప్రతి వారం గణాంకాలు వెల్లడించి సభాపతిగా తనకున్న జవాబుదారీతనాన్ని చాటుకున్నారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఒక్కర్నీ సభనుంచి బయటికి పంపకుండా, ఒక్క నిమిషం కూడా సభను వాయిదా వేయకుండా అత్యంత చాకచక్యంగా సభను నిర్వహించి సున్నితంగా ఆ బిల్లును పాస్ చేయించి అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేశారు.
మాతృ రాష్ట్రానికి చేయూత : వాజ్‌పేయీ హయాంలో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించే ప్రధానమంత్రి గ్రామ్‌సడక్ యోజన, మోదీ హయంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్మార్ట్‌సిటీలు, అమృత్పథకాన్ని మొదలుపెట్టిన ఘనత వెంకయ్యనాయుడికే దక్కుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ మంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే అత్యధికంగా పట్టణ పేదల ఇళ్లు మంజూరుచేసి స్వరాష్ట్రం పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, కాకినాడలను స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చి అక్కడ మౌలికవసతుల మెరుగుదలకు కేంద్రం నుంచి సాయం అందేలా చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో డ్రైనేజీ సౌకర్యం మెరుగుదల కోసంమెరుగుదల, అమరావతి నగర మౌలిక సదుపాయాల కోసం రూ.1,500 కోట్లు మంజూరుచేసి రాష్ట్రానికి తనవంతు చేయూతనిచ్చారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో విభజన చట్టంలోని హామీల అమలు కోసం నిరంతరం అధికారులతో మాట్లాడుతూ వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. వీలున్నచోటల్లా మాతృభాష, మాతృరాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడానికి తనవంతు కృషి చేశారు.
యుక్తవయసు నుంచి ఆరెస్సెస్‌తో అనుబంధం : బుచ్చిరెడ్డిపాలెం జడ్పీ హైస్కూల్లో పాఠశాల విద్య, నెల్లూరు వీఆర్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో లా చేసిన ఆయన యుక్తవయస్సు నుంచే ఆరెస్సెస్, ఏబీవీపీలతో కలిసి పనిచేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థిసంఘం అధ్యక్షుడిగా గెలిచారు. జై ఆంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమానికి కన్వీనర్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో దానికి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. 1998 నుంచి 2017లో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టేంతవరకూ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఈ ఏడాది ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తుల్లో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది ఈయన ఒక్కరికే.
నవభారత నిర్మాణ భాగస్వాములకు అంకితం : వెంకయ్యనాయుడు
కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. ‘‘ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, యువకుడిగా ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటంలో పాల్గొని ప్రజాజీవితంలో వివిధ బాధ్యతలతో గ్రామాలు, పట్టణ పేదల అభివృద్ధి కోసం కృషిచేసిన నాకు జీవితంలో ప్రతి అడుగూ సంతృప్తిని అందించింది. ప్రతి అడుగులోనూ నా బాధ్యతను నిబద్ధుడనై, చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ముందుకుసాగాను. దేశంలోని గ్రామాలు, రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరికీ నా ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని చెప్పటానికి సంతోషిస్తున్నాను.