ఆవిష్కరణ సభలో యూనియన్ నాయకులు ఉద్ఘాటన
విజయవాడ : విస్తృత సమాచారంతో కూడిన మీడియా డైరీ 2024 జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) నాయకులు పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డైరీని, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ మీడియా డైరీ ని తీసుకు రావడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. సమాచారాన్ని, ముఖ్యమైన సంఘటనలను నిక్షప్తం చేసుకోవడానికి డైరీ ఎంతో దోహదపడుతుందని నాయకులు అన్నారు. ప్రతి జర్నలిస్టు డైరీ రాయడానికి అలవర్చుకోవాలని కోరారు. ఎపీయూడబ్ల్యూజే విజయవాడ యూనియన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన డైరీ ఆవిష్కరణ సభలో ఎపీయూడబ్ల్యూజే రాష్ట్ర డైరీని ఐజెయు కార్యదర్శ డి.సోమ సుందర్, ఎపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీని సి.చానల్ అధినేత టీ.వీ రమేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. విజయవాడ యూనిట్ తొలిసారిగా తీసుకొచ్చిన క్యాలెండర్ ను ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షులు ఐ.వి సుబ్బారావు ఆవిష్కరించారు. డైరీల ఆవిష్కరణకు ముందు రమేష్ బాబు, ఎపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ , డి.సోమసుందర్ , ఐ.విసుబ్బారావు, ఐజెయి కౌన్సిల్ సభ్యులు ఎస్.కే.బాబు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వారి ఎన్నికల ప్రణాళికలో పొందు పర్చాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు తమ సహాయ, సహకారాలు వుoటాయని రమేష్ బాబు హామీ ఇచ్చారు. వేదికపై ఏపీడబ్ల్యూజే ఉపాధ్యక్షులు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచెల జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు యేచూరి శివ ఆశీనులయ్యారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు తొలుత స్వాగతం పలికి వక్తలను వేదికపైకి ఆహ్వానించారు. ఎపీయూడబ్ల్యూజే కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వర రావు వందన సమర్పణ చేశారు.