ప్రచారాస్త్రాలుగా పథకాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కాలం మొదలైంది. సీఎం కేసీఆర్ సోమవారం
స్వయంగా 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే రాష్ట్రంలోని 119
మంది నియోజకవర్గాలకు పార్టీ పరంగా అభ్యర్థులు వేరుగా ఉన్నా, వారందరికీ దమ్ము,
ధైర్యం సీఎం కేసీఆరే. కులం, మతం, ప్రాంతం తేడాలేకుండా అన్ని వర్గాలకు సమ
ప్రాధాన్యం ఇస్తూ తొమ్మిదేండ్లుగా అనేక పథకాలను అమలు చేస్తున్నారు. స్వపక్షం,
ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రయోజనాలు అందుతున్నాయి. దీంతో రాష్ట్రంలో
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమలు చేసిన పథకాలనే ఎమ్మెల్యే అభ్యర్థులు
ప్రచార అస్ర్తాలుగా సంధించనున్నారు. ఉదాహరణకు రైతుల దగ్గిరికి వెళ్లినప్పుడు
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో
సాగునీరు, పంట కొనుగోళ్లు. ఇలా దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు
చేస్తున్న పథకాలను వివరించనున్నారు. యువతకు ఐటీ రంగంలో పెట్టుబడుల తీరు,
టీఎస్ఐపాస్తో వచ్చిన పారిశ్రామిక విప్లవం, స్కిల్ డెవలప్మెంట్, ప్రభుత్వ
ఉద్యోగాల జాతర వంటివి ప్రచారం చేయనున్నారు. విద్యార్థుల కోసం గురుకులాలు,
చదువుకునే యువత కోసం అనేక కొత్త కాలేజీలు, వైద్య విద్య చదవాలనుకునేవారి కోసం
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, విదేశాల్లో చదవాలంటే విద్యానిధి.. ఇలా
రాష్ట్రంలో విద్యా విప్లవానికి సీఎం కేసీఆర్ చేసిన కృషిని వివరించనున్నారు.
బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం దేశంలోనే ఎక్కడాలేని విధంగా అమలుచేస్తున్న
దళితబంధు, బీసీ బంధు, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు వంటి పథకాలన్నింటిలోనూ సీఎం
కేసీఆరే కనిపించనున్నారు.