సత్తెనపల్లి : ప్రతిపక్షాలపై మాటల తూటాలతో విరుచుకుపడే మంత్రి అంబటి రాంబాబు
శనివారం సత్తెనపల్లి లో నృత్యాలతో సందడి చేశారు. తనదైన హావభావాలతో డాన్సులు
ఇరగదీశారు. బంజారాలతో కలిసి సంప్రదాయ నృత్యాలతో అలరించారు.భోగిమంటల వేడుకల్లో
సందడిగా గడిపారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా మంత్రి అంబటి నృత్యం చేస్తున్నంతసేపు
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేరింతలు, కరతాళ్ళధ్వనులు, ఈలాలతో
హుషారెత్తించారు. పట్టణములో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉదయం 5 గంటలకే భోగి వేడుకలను
అంబటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో హుషారుగా గడిపారు.
ప్రజలతో మమేకమయ్యారు. నాయకులందరితోనూ డాన్స్ లు చేయించారు. బంజారాలతో కలిసి
అంబటి చేసిన సంప్రదాయ నృత్యం అలరించింది. ఈ సందర్భంగా మంత్రి అంబటి
మాట్లాడుతూ భోగి పండుగ ప్రజలందరికీ భోగభాగ్యాలను అందించాలని, సుభిక్షంగా
ఉండాలని ఆకాంక్షించారు. భోగి పండుగ ప్రాసస్యాన్ని వివరించారు. చెడును దహించి,
మంచిని స్వాగతిద్దామన్నారు. రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు
తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు రూరల్
మండల పార్టీ కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, మున్సిపల్ వైస్ చైర్మన్
కోటేశ్వరావు నాయక్, లక్కాకుల మరియన్న,
యువజన నాయకులు, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ , కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు,
కార్యకర్తలు పాల్గొన్నారు.