అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో నివాళులు అర్పించిన రాష్ర్టమంత్రులు మేరుగ
నాగార్జున, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ఎంపి నందిగమ్ సురేష్, ప్రభుత్వ విప్
జంగా కృష్ణమూర్తి, ఎంఎల్సి లేళ్ళ అప్పిరెడ్డి.
గుంటూరు : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి
సందర్భంగా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో
రాష్ర్టమంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపి నందిగమ్
సురేష్, ప్రభుత్వ విప్ జంగా కృష్ణమూర్తి, ఎంఎల్సి లేళ్ళ అప్పిరెడ్డి
అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ అంబేద్కర్
రచించిన రాజ్యాంగం ఫలితమే తన లాంటి వారు మంత్రి స్ధాయికి ఎదగడానికి కారణమని
అన్నారు. సమాజంలో అంటరానితనం వంటి వివక్షాపూరిత పరిస్ధితులను ఆకళింపు చేసుకుని
నిమ్నవర్గాలు అభివృధ్ది చెందాలనే మహోన్నత ఆశయంతో అంబేద్కర్ పనిచేశారన్నారు. గత
ప్రభుత్వాలు అంబేద్కర్ వంటి మహనీయుని మరిచిపోయాయన్నారు. కేవలం వర్ధంతి,
జయంతిలకు ఆయన విగ్రహాలకు దండలు వేయడం వంటివాటికి మాత్రమే పరిమితమయ్యాయన్నారు.
గతంలో చంద్రబాబు ఎస్సిలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించి
అంబేద్కర్ ఆలోచనలకు తూట్లు పొడిచారన్నారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేశారన్నారు.
దివంగత మహానేత వైయస్సార్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పరిపాలించారన్నారు.
అంబేద్కర్ ఆలోచించిన విధంగా ఎస్సిఎస్టి బిసి మైనారిటీల అభ్యున్నతి కోసం
పనిచేస్తున్న జగన్ కు అండగా నిలవాలని కోరారు. పేదరిక నిర్మూలనకోసం అంబేద్కర్
బాటలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రాష్ర్ట సమాచార శాఖమంత్రి
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ భారతీయులందరి ఆరాధ్యదైవం డాక్టర్
బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ లక్ష్యాలను, ఆశయాలను ముందుకు
తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ దని అన్నారు. నేడు ఖరీదైన విద్యను
పేద,బడుగు,బలహీన వారికి చేరువచేస్తూ అంబేద్కర్ సూచించిన విధంగా
పనిచేస్తున్నారని తెలియచేశారు. సమాజంలో పాలకుడి దార్శనికత ఎలా ఉండాలో ఆ విధంగా
వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. జగన్ పరిపాలన బిఆర్ అంబేద్కర్ కు
ఘనమైన నివాళిగా నిలుస్తుందన్నారు. డాక్టర్ అంబేద్కర్ అందరికి రాజ్యాంగం రూపంలో
పెద్ద ఆస్ధిని ఇచ్చారని, దానిని అందరూ అవగాహన కల్పించుకోవాలన్నారు.
భారతదేశంలోనే కాదు ప్రపంచదేశాలన్నీ కూడా అంబేద్కర్ ను ప్రపంచ మేధావిగా
గుర్తించాయన్నారు.
శాసనమండలిలో విప్ జంగాకృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్
బిఆర్ అంబేద్కర్ రాజ నీతిజ్ఞుడుగా, ప్రపంచమేధావిగా గుర్తింపు పొందారన్నారు.
వివక్షతకు గురైన వర్గాలకు న్యాయం చేసేవిధంగా అందరికి సమానత్వం ప్రాతిపదికన
రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారని తెలియచేశారు. నేడు ఆ వర్గాలు
రాజ్యాంగం ద్వారా తగిన ఫలాలు అందుకుంటున్నాయని వివరించారు. అనేక దేశాల
సామాజిక,ఆర్దిక,జీవన విధానాలను అధ్యయనం చేసి మరీ రాజ్యాంగాన్ని రాయడం
జరిగిందన్నారు. అంబేద్కర్, పూలే వంటి మహనీయులు సమాజంలో వెనకబడిన వర్గాలకోసం
అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. అంబేద్కర్, పూలే ఆశయాలను ముందుకు
తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ దని అన్నారు. పార్లమెంట్ సభ్యులు
నందిగమ్ సురేష్ మాట్లాడుతూ అంబేద్కర్ వంటి మహనీయులు ఆయన రాసిన రాజ్యాంగం
రూపంలో నేడు కూడా జీవించే ఉన్నారని అన్నారు. దేశంలో ప్రతి కులానికి ఆయనే
దేవుడన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేవిధంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు.
గత పాలకులు అంబేద్కర్ ఆలోచనావిధానానికి తూట్లు పొడిచారన్నారు. నేడు వైయస్
జగన్ అంబేద్కర్ మార్గనిర్ధేశం చేసిన విధంగా అందరికి విద్య అందించి,
బడుగు,బలహీన వర్గాల అభివృద్దికి నిరంతరం తపిస్తున్నారన్నారు.
భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్
అని కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ళఅప్పిరెడ్డి
అన్నారు. నేడు భిన్న సంస్కృతులు, భిన్నజాతులు కలిసి జీవనం చేస్తూ భారతదేశం
అతిపెద్ద ప్రజాస్వామ్యదేశంగా మనగలుగుతుందంటే దానికి అంబేద్కర్ రచించిన
రాజ్యాంగమే కారణమన్నారు. భారతీయులందరికి పవిత్రగ్రంధంగా రాజ్యాంగం
కొనియాడబడుతుందన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్
ముందుకు వెళ్తున్నారని తెలియచేశారు. పేదరికం నిర్మూలనకు, బడుగు,బలహీన వర్గాల
అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ
కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ,
గ్రంధాలయసంస్ధ రాష్ర్ట ఛైర్మన్ మందపాటి శేషగిరిరావు, నవరత్నాల ప్రోగ్రామ్
వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, నెడ్ క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్, పార్టీ
రాష్ర్ట విద్యార్ధి విభాగం పానుగంటి చైతన్య పలువురు పార్టీ నేతలు పలు
కార్పోరేషన్ ల ఛైర్మన్ లు పాల్గొన్నారు.