రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర
పార్వతీపురం : భారతరత్న బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి
ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక
రాజన్న దొర అన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఉప ముఖ్యమంత్రి
క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు
వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ డా.బి.ఆర్
అంబేద్కర్ గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని
రచించిన మహోన్నత వ్యక్తి అన్నారు. బ్రిటన్ తో జరిగిన మూడు రౌండ్ టేబుల్
సమావేశాల్లో ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించి, నివేదికలు ప్రతిపాదనలను
అందించి 1935 భారత ప్రభుత్వ చట్టం రూపొందించడంలో కీలక భాగస్వామి అయ్యారని
అన్నారు. రాజ్యంగాన్ని దేశానికి అందించి సంస్థానాలుగా ఉన్న దేశాన్ని
సర్వసత్తాక స్వామ్యవాద, గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడంలో కీలక పాత్ర
పోషించారని అన్నారు. దేశంలో న్యాయ, కార్మిక, జల, విద్యుత్, వ్యవసాయ రంగాలు
పెద్ద ఎత్తున ప్రగతి సాధనకు అంబేద్కర్ చూపిన మార్గదర్శకత్వం మరువలేనిది
అన్నారు. అస్పృశ్యత, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు పటిష్టంగా ఉన్న
రోజుల్లో వాటిని ఎదిరించి, నిలదొక్కుకుని ఉన్నత విద్యను అందిపుచ్చుకోవడమే
కాకుండా దేశానికి దిశా నిర్దేశనం చేశారని ఆయన పేర్కొన్నారు. యువత అంబేద్కర్
జీవితం నుండి స్ఫూర్తి పొంది భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికార, అనధికారులు పాల్గొన్నారు.