వెలగపూడి : ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి రోజున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి, అంబేద్కర్ విగ్రహనిర్మాణ కమిటీ ఛైర్మెన్ మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పనుల్లో ఎక్కడా అలసత్వం జరగకుండా పనులను పటిష్టంగా పర్యవేక్షించాలని కోరారు. సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి మేరుగు నాగార్జున తో పాటుగా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సమీక్షించగా, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఆదిమాలం సురేష్ ఈ సమావేశంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ 268 కోట్ల రుపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులను నిర్ణీత సమయాల్లోపుగానే పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా చూసుకోవాలని సూచించారు.