టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
గుంటూరు : రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలి వాన
బీభత్సంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ
అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం
జరిగినట్లు ప్రాథమిక అంచనాలు తెలియజేస్తున్నాయని, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ
వరకు కురిసిన భారీవర్షాలు వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు.
మొక్కజొన్న, మిరప, పెసర, మినుము పంటలతోపాటు అరటి, బొప్పాయి, మామిడి తదితర
పంటలకు అధికంగా నష్టం జరిగిందని, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో రైతుల దగ్గర
ధాన్యం నిల్వలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే ఆశతో తమవద్దే
ఇళ్ల ముందు పట్టాలు కప్పి నిల్వ చేసుకున్న ధాన్యం తడిచి నష్టం కలిగిందని,
తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. పల్నాడు, ప్రకాశం,
ఎన్టీఆర్, కర్నూలు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ జిల్లాల్లో మిరప
రైతులు కోట్లాది రూపాయల మేర నష్టపోయారని, ఇప్పటికే తామర పురుగు ఆశించడంతో పంట
దిగుబడి గణనీయంగా తగ్గగా, మూడు రోజులుగా కురిసిన వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన
పంట తడిచిపోయిందని, నష్టాల్లో ఉన్న మిర్చి రైతులను ప్రభుత్వం ఉదారంగా
ఆదుకోవాలన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి, ముసునూరు, టి.నరసాపురం మండలాల్లోనూ
వడగళ్ల వానకు మామిడి, పొగాకు, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని,
త్వరతిగతిన నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ
అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోరారు.