వికారాబాద్ : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని
మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి
అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం పర్యటించారు.
గురువారం కురిసిన వడగండ్ల వానలతో దెబ్బతిన్న మామిడి, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి
ఉద్యానవన పంటలతో పాటు మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలను పరిశీలించారు. ఈ
సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో
2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. రైతులకు భరోసా, ధైర్యాన్ని
కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం
ఆదుకుంటుందని తెలిపారు.