విజయవాడ : మహిళలు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రంలో సంతోషించే మొదటి వ్యక్తి
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గవర్నర్ పేటలోని ఐ.వి.ప్యాలెస్లో సోమవారం
జరిగిన వైఎస్సార్ ఆసరా ఉత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్
అవుతు శ్రీశైలజా రెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అనితతో కలిసి ఆయన
పాల్గొని మహిళలకు మెగా చెక్కును అందజేశారు. గిరిపురం, కస్తూరిభాయిపేట
ప్రాంతాలలో సామాన్య, పేద, మధ్య తరగతి మహిళలు ఎక్కువగా నివసిస్తుంటారని, వారి
ఆర్థిక ప్రగతికి ఈ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు మల్లాది విష్ణు
వెల్లడించారు. వైఎస్సార్ ఆసరా మూడో విడత ద్వారా డివిజన్ లోని 155 గ్రూపులలో
రూ. కోటి 21 లక్షల 61 వేల 65 రూపాయల నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా 33,427 మంది పొదుపు సంఘాల మహిళలకు 29 కోట్ల 52 లక్షల 91
వేల 581 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. మూడు విడతల్లో మొత్తంగా రూ. 90
కోట్లు డ్వాక్రా గ్రూపులలో జమ చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఆసరా ద్వారా
చేకూరుతున్న ప్రయోజనాలు, స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు పథకం ఏవిధంగా అండగా
నిలుస్తుందన్న విషయాలపై లబ్ధిదారులకు విస్తృత అవగాహన కల్పించారు.
మాది మహిళా పక్షపాత ప్రభుత్వం
పాదయాత్ర సమయంలో ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వారి
సంక్షేమం కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారని మల్లాది విష్ణు అన్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2.25 లక్షల కోట్లు అక్క
చెల్లెమ్మలకు అందించినట్లు పేర్కొన్నారు. సెంట్రల్లో మహిళ సంక్షేమానికి
అక్షరాలా 314 కోట్ల 9 లక్షల 75 వేల 819 రూపాయలను వెచ్చించినట్లు చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక ప్రగతి సహకరించనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు
కట్టుబడి ఏటా క్రమం తప్పకుండా ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారని మల్లాది
విష్ణు తెలిపారు. సున్నావడ్డీ, చేయూత వంటి సంక్షేమ పథకాలు పేద మహిళల ఆర్థిక
స్వావలంబనతో పాటు వారి కుటుంబాన్ని ఆర్థిక ప్రగతి వైపు నడిపిస్తున్నాయని
పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో
అక్కచెల్లెమ్మలు ఈరోజు నిత్యావసర సరుకుల షాపులు, వస్త్ర వ్యాపారం, పాడి,
గొర్రెలు, మేకలు పెంపకం, పౌల్ట్రీ, పుడ్ ప్రాసె సింగ్ యూనిట్లు, కూరగాయలు,
పండ్లు, పచ్చళ్ల వ్యాపారం, హస్తకళలలతో పాటు తమకు నైపుణ్యం కలిగిన రంగాలలో
రాణిస్తున్నారని తెలిపారు. అదే గత తెలుగుదేశం హయాంలో ఆర్థిక క్రమశిక్షణ కలిగిన
పొదుపు సంఘాలన్నీ ఏ గ్రేడ్ నుంచి సి గ్రేడ్ కి పడిపోయాయని ఈ సందర్భంగా
గుర్తుచేశారు. కనుక మంచి చేస్తున్న సీఎం జగనన్న ప్రభుత్వానికి అన్నివిధాలా
అండగా నిలవాలని కోరారు.