డిసెంబరు రెండో వారంలోగా పోలింగ్ ముగించే దిశగా యోచన
రాష్ట్రానికి ముగ్గురు సభ్యుల బృందం
నవంబరు 4న తుది ఓటర్ల జాబితా వెల్లడి
ఎన్నికల్లో డబ్బు కట్టడిపై పకడ్బందీ చర్యలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు కేంద్ర
ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. ఎన్నికలకు ముహూర్తాన్ని ఖరారు చేసేందుకు
విస్తృత కసరత్తు చేపట్టింది. అక్టోబరు రెండో వారంలోగా షెడ్యూల్‌ను
ప్రకటించాలని యోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేసేందుకు ప్రధాన
ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల బృందం
రాష్ట్రానికి రానుంది. అక్టోబరు మొదటి వారంలో వచ్చేందుకు ప్రణాళిక
రూపొందిస్తోంది. ఇంతక్రితం గడువుకు ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని
రద్దు చేయటంతో 2018 అక్టోబరు 6న షెడ్యూల్ వచ్చింది. డిసెంబరు 7న పోలింగు
జరిగింది. జనవరి 17న అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమేరకు
రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఉంది.
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఇదే
గడువు. మిజోరం అసెంబ్లీ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబరు 17తో ముగియనుంది.
తెలంగాణతోపాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు ఒకే దఫా షెడ్యూలును ప్రకటించేందుకు
ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రభుత్వ సెలవులతోపాటు
స్థానిక పండగల సెలవులు ఏమైనా ఉన్నాయా అని కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది.
సాధారణంగా అక్టోబరు, నవంబరు నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండగలు పెద్దవి.
వేరే సెలవులు లేవని అధికారులు గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎలక్షన్
కమిషన్ పూర్తి స్థాయి బృందం రెండు దఫాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తుంది.
షెడ్యూల్ ప్రకటించటానికి ముందు సన్నద్ధతను అధ్యయనం చేసేందుకు, మరో దఫా
నామినేషన్ల గడువు ముగిసిన తరవాత ఈ పర్యటనలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం
తొలి పర్యటనకే పరిమితం అవుతుంది. ఇప్పటికే ఎన్నికల సంఘంలోని ఉన్నతస్థాయి
అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి ఎన్నికల సన్నద్ధత తొలిదశను
పరిశీలించింది. మరోపక్క ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ రాష్ట్రంలో
ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. నవంబరు 4న
తుది ఓటర్ల జాబితాను వెలువరించనున్నారు.
ఎన్నికల్లో డబ్బు కట్టడిపై పకడ్బందీ చర్యలు : ఈ దఫా కూడా డిసెంబరులోనే పోలింగు
ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని
సన్నద్ధం చేస్తోంది. డిసెంబరు రెండో వారంలోగా పోలింగును ముగించేందుకు ఉన్న
అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల పరిశీలకులను నియమించేందుకు
అధికారుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. కీలక నియోజకవర్గాల్లో ప్రత్యేక
పరిశీలకులను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో
జరిగే ఎన్నికల్లో డబ్బు ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండనున్న దృష్ట్యా ఎన్నికల
సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని హుజూరాబాద్,
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు సుమారు రూ.వెయ్యి కోట్లకు పైగా
ఖర్చు చేసినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నిఘాను మరింత విస్తృతం చేయాలని
సంఘం ఇప్పటికే నిర్ణయించింది. దేశంలో ఉన్న 20కి పైగా ఎన్ఫోర్స్మెంట్
ఏజెన్సీలను రంగంలోకి దింపనుంది. డబ్బు వినియోగాన్ని కట్డడి చేసేందుకు
అనుసరించాల్సిన వ్యూహంపై ఆయా సంస్థలు రూపొందించే ప్రణాళికలను పరిశీలిస్తుంది.
అక్టోబరులో రాష్ట్ర పర్యటన సందర్భంగా సమీక్షిస్తుంది. ఆయా సంస్థలకు
సమాచారాన్ని సైతం పంపింది.