అమెరికా అధ్యక్ష పదవి రేసులోమరో భారతీయ అమెరికన్ నిలిచారు. ఇంజినీర్ అయిన
హర్ష్వర్ధన్ సింగ్ యూఎస్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు
తాజాగా ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద ఆయన
నమోదు చేసుకున్నారు. కాగా, ఇప్పటికే ఇద్దరు ప్రవాస భారతీయులైన నిక్కీ హేలీ,
వివేక్ రామస్వామి ఈ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మూడో
అభ్యర్థిగా హర్ష్వర్ధన్ సింగ్ చేరారు. ఇక ఈ ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ
తరపున పోటీలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటికే రిపబ్లికన్
పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పోటీ
చేస్తానని ప్రకటించిన విషయం విదితమే. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల
విషయంలో రిపబ్లికన్లలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం దీంతో స్పష్టమవుతోంది.
అయితే, ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలనేది మాత్రం రిపబ్లికన్ల
జాతీయ సదస్సు నిర్ధారిస్తుంది.