విజయవాడ : దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలను శాచ్యురేషన్ విధానంలో గడప గడపకు
చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని ప్లానింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సోమవారం 32 వ డివిజన్
228 వ వార్డు సచివాలయ పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్, అధికారులతో కలిసి ఆయన
పాల్గొన్నారు. బుడమేరు కట్టరోడ్డు, పలగాని ప్రభాకర్ వీధులలో విస్తృతంగా
పర్యటించి 186 ఇళ్లను సందర్శించారు. ఒక్కో కుటుంబానికి కలిగిన లబ్ధి, వారి
వ్యక్తిగత జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా కలిగిన మార్పును అడిగి
తెలుసుకున్నారు. నవరత్నాల కార్యక్రమాలతో 85 శాతం మంది ప్రజలు ఆనందంగా ఉన్నామని
తెలియజేయడం జగనన్న సంక్షేమపాలనకు నిదర్శమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ
సందర్భంగా స్థానిక సమస్యలపై ఆరా తీశారు. బుడమేరు కట్ట రోడ్డులో ప్రధాన కాలువ
పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు
సూచించారు. అలాగే న్యూ అయోధ్యనగర్ ప్రధాన రహదారిలో సైడ్ కాలువపై సిమెంట్
బిల్లలు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా
లబ్ధి పొందిన పలువురు అక్కచెల్లెమ్మలతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కాసేపు
ముచ్చటించారు. అగ్రవర్ణాలలోనూ పేదలు ఉన్నారని గుర్తించిన తొలి ప్రభుత్వం
రాష్ట్ర చరిత్రలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన
పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య,
క్షత్రియ, వెలమలతో పాటు ఇతర అగ్రవర్ణ సామాజికవర్గాల్లోని పేద మహిళలకు కూడా
మేలుచేయాలన్న సత్సంకల్పంతో ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’పథకాన్ని ప్రవేశపెట్టారని
తెలిపారు. నియోజకవర్గంలో 1,947 మందికి గత ఆర్థిక సంవత్సరం రూ. 2 కోట్ల 92
లక్షల 5 వేల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించారు.
కార్యక్రమంలో డీఈ రామకృష్ణ, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, లింగాల శ్రీనివాస్
రావు, శ్యామ్, శ్రీనివాసమూర్తి, గణేష్, రంగా, త్రివేణిరెడ్డి, బెజ్జం రవి,
భోగాది మురళి, ఇతర నాయకులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది
పాల్గొన్నారు.