విజయవాడ : ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన పి శివరామరాజు
అజాతశత్రువుగా మెలిగారని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అన్నారు.
శివరామరాజు మృతి ఎంతో బాధాకరమని ఆయన ఆత్మకు శాంతికలగాని వారి కుటుంబానికి తన
ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ శాఖ
అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన సంతాప సభలో
ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టు,
ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ మాజీ కార్యదర్శి పి శివరామరాజు చిత్రపటానికి
పూలమాలవేసి ఏపీయూడబ్ల్యూజే అర్బన్ యూనిట్ ఘనంగా నివాళులు అర్పించింది.
శివరామరాజు మృతికి నివాళులు అర్పిస్తూ రెండు నిముషాలపాటు మౌనం పాటించింది.
అనంతరం అంబటి మాట్లాడుతూ శివరామరాజు ఎంతో సౌమ్యుడని ఎలాంటి వివాదాలకు
తావివ్వకుండా అందిరితో నవ్వుతూ తన పనితాను చేసుకుని వెళ్లిపోయేవారని,
వివాదాలకు అతీతంగా వ్యవరించేవారని తెలియజేశారు. శివరామరాజు హైదరాబాదు నుంచి
బదిలీపై విజయవాడ వచ్చినప్పటి నుంచి తనతో ఎంతో సన్నిహితంగా మెలిగే వారన్నారు.
అలాగే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయిస్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీలో ప్రముఖ
పాత్ర పోషించి నాలుగేళ్లపాటు ఎంప్లాయిస్ రుణాల మంజూరు విషయంలో కీలకపాత్ర
పోషించారన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్
మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో యూనియన్‌కు విజయవాడ కార్యదర్శిగా
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన శివరామరాజు మృతి ఎంతో
దురదృష్టకరమన్నారు. ఆయన మృతి యూనియన్‌కు తీరనిలోటన్నారు. ఐజేయూ కౌన్సిల్
మెంబరు ఎస్కే బాబు మాట్లాడుతూ శివరామరాజు జర్నలిస్టుగా రాణించడమే కాకుండా
క్యారమ్స్ లో కూడా మంచి నిష్ణాతుడని తెలిపారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ ప్లాంట్ యూనియన్ నాయకుడు పీవీ రావు
మాట్లాడుతూ ఒక ఫ్రూఫ్ రీడర్‌గా ప్రవేశించిన శివరామరాజు అందరితో అన్యోన్యంగా
ఉండేవారన్నారు. తమ హయాంలో 11 మంది ఫ్రూఫ్ రీడర్లతో కార్యాలయం కళకళలాడుతూ
ఉండేదన్నారు. తన వద్దకు వచ్చిన ప్రూఫ్ర్ ను కేవలం ఐదారు నిముషాల్లో పూర్తిచేసి
తనకి ఇచ్చేవారని ఆయన ప్రతిభను కొనియాడారు. అలా అందరు ప్రూఫ్ రీడింగ్ ను
క్షణాల్లోనే ఇచ్చేయడంతో పత్రికను సకాలంలో ఇచ్చేందుకు వారందరూ
తోడ్పడేవారన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ
హోదానే ముఖ్యం కాకుండా శివరామరాజు ప్రూఫ్ రీడర్ నుంచి సబ్ ఎడిటర్ హోదాలో కూడా
కొనసాగి యూనియన్ కు పట్టుకొమ్మగా నిలిచారు. ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి
కొండా రాజేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబరు దారం వెంకటేశ్వరరావు, ఇండియన్
మాజీ ఎంప్లాయిస్ మల్లారెడ్డి, ఎంసీకే రాజు, సీనియర్ జర్నలిస్టు శ్రీధర్,
సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి తదితరులు పాల్గొని
శివరామరాజుకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.