బడ్జెట్ ప్రతులకు సచివాలయ చాంబర్ లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూజలు
అనంతరం సీఎంకు బడ్జెట్ ప్రతులను అందజేసిన ఆర్ధిక శాఖ మంత్రి
అమరావతి : అట్టడుగు ప్రజల అభ్యున్నతికి బడ్జెట్ లో పెద్దపీట వేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో బడ్జెట్ ప్రతులకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉండి ఉంటే, కోవిడ్-19 విపత్తు రాకపోయినట్లైతే ఏపీలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేవారమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అయినప్పటికీ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశామన్నారు. ప్రభుత్వం లేకపోతే బతకడమే కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే తమ ప్రాధాన్యతగా మంత్రి తెలిపారు. గత ఐదేళ్ల బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిచ్చినట్లు ఆయన వివరించారు. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్ లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బడ్జెట్ ప్రతులను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అందజేశారు. అంతకుముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టే సందర్భంగా ఓటాన్ ఎకౌంటు బడ్జెట్ పత్రాలను కనకదుర్గమ్మ పాదాల చెంత ఉంచి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి కే వి వి సత్యనారాయణ, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి బి సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.