‘సిప్రీ’ నివేదికలో వెల్లడి
స్టాక్‌హోమ్ : ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో ఆందోళనకర పరిస్థితులు
నెలకొన్న తరుణంలో ఓ కీలక నివేదిక ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. పలు
దేశాలు తమ అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటున్నాయని పేర్కొంది. స్వీడన్‌కు
చెందిన మేధోమథన సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్
ఇన్స్టిట్యూట్’ (సిప్రీ) ఈ నివేదికను రూపొందించింది. మన పొరుగు దేశం చైనా
అణ్వాయుధ సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. ఇతర అణ్వస్త్ర దేశాలు
సైతం తమ ఆయుధాలను ఆధునికీకరిస్తున్నాయని వెల్లడించింది. సిప్రీ తాజా నివేదిక
ప్రకారం గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య తగ్గుతూ వచ్చింది.
తాజాగా ఈ పోకడకు ముగింపు పడింది.
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న తొమ్మిది దేశాలు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్,
ఇజ్రాయెల్, ఉత్తర కొరియా, పాకిస్థాన్, రష్యా, అమెరికా దగ్గర 2023 జనవరి
నాటికి 12,512 అణ్వాయుధాలు ఉన్నాయి. 9,576 అణ్వాయుధాలు సైనిక ఆయుధాగారాల్లో
ఉన్నాయి. ఇవన్నీ వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లే. ఇలా సైనిక అవసరాలకు
వాడడానికి సిద్ధంగా ఉన్న అణ్వస్త్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిలో 3,844
వార్హెడ్లను క్షిపణులు, యుద్ధవిమానాలతో కలిపి మోహరించారు. 2వేల అస్త్రాలను
హై అలర్ట్‌లో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల సంఖ్యలో ఇప్పటికీ
అమెరికా, రష్యా వద్దనే 90 శాతం ఉన్నాయి. అత్యధికంగా చైనా అణ్వాయుధాల సంఖ్య
350 నుంచి 410కి పెరిగింది. భారత్- చైనా మధ్య గతకొన్నేళ్లుగా సరిహద్దుల వద్ద
ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమని
నిపుణులు అంటున్నారు. అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు భారత్, పాకిస్థాన్‌లు
కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. భారత అణు సామర్థ్య ప్రధాన లక్ష్యం
పాక్. అయితే దీర్ఘశ్రేణి ఆయుధాలపై భారత్ ఎక్కువ దృష్టిపెడుతున్నట్లు
కనపడుతోంది. చైనాలోని అన్ని ప్రాంతాలనూ చేరగల అస్త్రాలను సమకూర్చుకునేందుకు
ప్రాధాన్యం ఇస్తోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అణు
నిరాయుధీకరణ కార్యక్రమం గాడి తప్పిందని సిప్రీ పేర్కొంది.