టాప్20లో భారత్ లోని 14 ప్రాంతాలకు చోటు
స్విట్జర్లాండ్ సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడుతూ.. అభివృద్ధిలో
దూసుకెళ్తున్న భారత్ ఓ విషయంలో మాత్రం నిరాశ పరుస్తోంది. కాలుష్యాన్ని
నియంత్రించడంలో విఫలం అవుతోంది. అత్యధిక కాలుష్యానికి కారణమవుతున్న దేశాల్లో
ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని 100
అత్యధిక కాలుష్య నగరాల్లో 65 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ఈ మేరకు
స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూఎయిర్’
ప్రపంచ వాయు నాణ్యత నివేదిక – 2022ను విడుదల చేసింది. ఈ జాబితాలో షాకింగ్
విషయాలు వెల్లడయ్యాయి. భారత్ లో అత్యధిక కాలుష్య నగరాలన్నీ ఉత్తర భారత్ లోనివే
కావడం గమనార్హం. దేశంలోనే అత్యంత కలుషిత ప్రాంతంగా మహారాష్ట్రలోని భీవండి
నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో
నిలిచింది. అంతేకాదు అత్యంత కలుషిత దేశ రాజధానుల్లో ఢిల్లీ రెండో స్థానంలో
నిలవడం శోచనీయం. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య ప్రాంతాల్లో 14 ప్రాంతాలు
భారత్ లోనే ఉన్నాయి. ఈ జాబితాలో దర్భంగ, అసోపూర్, పట్నా, ఘజియాబాద్,,
ముజఫర్‌నగర్, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్ ఉన్నాయి.