కోనసీమ ఎస్పీతో మాట్లాడిన ‘జయశ్రీ రెడ్డి’
కేసు పారదర్శక విచారణకు ఆదేశం
విజయవాడ : కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయానాం గ్రామంలో మైనరు బాలికపై
జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సత్వరమే స్పందించింది.
ఘటన వివరాలు ఆరాతీసి సీరియస్ గా రంగంలోకి దిగింది. ఈ మేరకు కమిషన్ సభ్యులు
కర్రి జయశ్రీ రెడ్డి కోనసీమ జిల్లా ఎస్పీతో మాట్లాడారు. కేసు పూర్వాపరాలు
తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన నేరస్తులను పట్టుకోవడంలో జాప్యం
లేకుండా వ్యవహరించేలా కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలివ్వాలని ఆమె కోరారు.
కేసును పారదర్శక విచారణతో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు
తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ నివేదికను మహిళా కమిషన్ కు
నివేదించాలని జయశ్రీరెడ్డి కోరారు. ఘటనపై ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద
కేసు నమోదు చేశామని, ఎల్ అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, ముమ్మిడివరం సీఐ
జానకీరామ్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారని ఎస్పీ వివరించారు.
నేరానికి పాల్పడిన వారిని ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు.
బాధితురాలి ఆరోగ్యం విషయంలో తగిన వైద్యం సక్రమంగా అందించాలని అమలాపురం మహిళా
శిశు సంక్షేమ శాఖ అధికారులను జయశ్రీ రెడ్డి కోరారు.