ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు హెచ్చరిక
విజయవాడ : సోమవారం విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో సాయంత్రం 4 గం॥లకు జరిగే
“జై భారత్ సత్యాగ్రహ” భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఏపిసిసి అధ్యక్షులు
గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఆదివారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ నందు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ
సమావేశంలో ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం
దేశాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమయిందని అన్నారు. అదానీ అక్రమాలపై తక్షణం
జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వేయాలని, లేకపోతే ఖబడ్దార్ అని
హెచ్చరించారు. మహిళలపై అత్యాచారాలు, శాంతి భద్రతలు, ముస్లిం మైనార్టీ
వర్గాలపైన, పాస్టర్లపైన దాడులు తీవ్రమయ్యాయని, ఇది ఆపకపోతే ఖబడ్దార్ అంటూ
రుద్రరాజు హెచ్చరించారు. రాహుల్ గాంధీ విషయంలో అనవసర రాద్దాంతం చేసి
సస్పెన్షన్ వేటు వేయడమే కాకుండా క్వార్టర్స్‌ను ఖాళీ చేయమని ఆదేశించడం వంటివి
తీవ్ర పరిణామాలని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాగే దేశంలో కొనసాగితే
కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున శాంతియుత ఆందోళన కార్యక్రమాలు చేపడతారని ఆయన
హెచ్చరించారు. 24వ తేదీ సోమవారం జింఖానా గ్రౌండ్లో జరుగు భారీ బహిరంగ సభకు
రాష్ట్రం నుండి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారని, జాతీయ
స్థాయి నాయకులు పాల్గొంటున్నారని అన్నారు. ఈ బహిరంగ సభను జయప్రదం చేయవలసినదిగా
ప్రజల మద్దతును కోరారు. దేశవ్యాప్తంగా సెక్యులర్ భావజాలం ప్రమాదంలో పడిందని
చెప్పారు. నెహ్రూ హయాంలో నుండి మన్మోహన్ సింగ్ వరకు అనేక రకాలైన అభివృద్ధి
పనులు జరిగాయని, పట్టెడన్నం, నీడ, నీరు, ఇందిరా గాంధీ నినాదం జై జవాన్ – జై
కిసాన్, రాజీవ్ గాంధీ నినాదం సూపర్ కంప్యూటర్స్ నినాదం సఫలీకృతం అయింది.
సోమవారం జరగబోవు బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, మీడియా మిత్రులతో పాటు వేలాది
మంది ప్రజలు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిసిసి
అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో పాటు ఏపిసిసి కార్యనిర్వహక అధ్యక్షులు షేక్
మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, పి.రాకేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు
నరహరశెట్టి నరసింహారావు, మీసాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.