దేశవ్యాప్తంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా
రాష్ట్రపతి, ప్రధాని, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై, జనసేనాని పవన్
కల్యాణ్, కేటీఆర్, ఇతర నాయకులు ట్వీట్ చేశారు.
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి.
శుక్రవారం రాష్ట్రం పదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ కాలంలో రాష్ట్రం సాధించిన
విజయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర
మోడీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ వంటి ప్రముఖులు ట్విటర్
వేదికగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర
మోడీ తెలుగులో ట్వీట్ చేశారు.
‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం,
ప్రతిభావంతులైన వ్యక్తులను కలిగి ఉంది. అడవులు, వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది.
ఆ రాష్ట్రం ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది. తెలంగాణ అభివృద్ధి, శ్రేయస్సు
ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలంగాణ
ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా
శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజల నైపుణ్యాలు, సంస్కృతీ వైభవం ఎంతో గుర్తింపు
పొందాయి. తెలంగాణ శ్రేయస్సు, సౌభాగ్యం కోసం నేను ప్రార్థిస్తున్నాను’ అంటూ
ట్విటర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. సంతోషకరమైన ఈ
సందర్భం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల హృదయాలను ఆనందం, గర్వంతో
నింపుతోందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం అనేక మంది యువకులు చేసిన
త్యాగాలను స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు.
ఉద్యమంలో అమరులైన వారికి, వారి అంకితభావానికి హృదయ పూర్వకంగా నివాళులు
అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
‘తెలంగాణ మోడల్’ పాలనను… అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న
శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
‘తెలంగాణ మోడల్’ పాలనను అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. 6
దశాబ్దాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను రాష్ట్ర
అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు.
తెలంగాణ కీర్తి అజరామరం : జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
ఎంతోమంది పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన
అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. అలాంటి త్యాగధనులందరికీ నివాళులర్పిస్తున్నట్లు
చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పవన్
శుభాకాంక్షలు తెలిపారు.