చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం
భీమవరంలో తూర్పుకాపు రాష్ట్రస్థాయి నాయకులతో పవన్‌కల్యాణ్ భేటీ
భీమవరం : వారాహియాత్రలో భాగంగా తూర్పుకాపు రాష్ట్రస్థాయి నాయకులతో జనసేన
అధినేత పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి జనాభాపై
లెక్కలు తీస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తనకు బలమైన జ్ఞాపకాలను
ఇచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుకాపుల సంక్షేమానికి
బీజం ఇక్కడే పడిందని చెప్పారు. ‘వారాహి యాత్ర’లో భాగంగా భీమవరంలో తూర్పుకాపు
రాష్ట్రస్థాయి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా
సమస్యలను తెలుసుకునే కార్యక్రమమే జనవాణి అని చెప్పారు. తూర్పుకాపులు తమ
సమస్యలు చెప్పినప్పుడు క్షుణ్ణంగా విన్నానని, వారి క్షోభను దగ్గరి నుంచి
చూశానని అన్నారు. వంశధార నిర్వాసితుల్లో ఎక్కువమంది తూర్పుకాపులే. వాళ్లు
ఎక్కువగా వలసలు వెళ్తున్నారు. దేశంలో ఏ నిర్మాణం వెనుకైనా ఉత్తరాంధ్ర తూర్పు
కాపులున్నారు. వారి జనాభాపై ఒక్కో ప్రభుత్వం ఒక్కో లెక్క చెబుతోంది. ఏ
ప్రాతిపదికన లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు. జనసేన వస్తే ముందుగా
లెక్కలు తీస్తాం. తెలంగాణ సమాజంలోనూ తూర్పుకాపుల సంఖ్య ఎక్కువ. అందుకే
సమాజానికి ఎంతో చేస్తున్న తూర్పు కాపులకు ఏదోఒకటి చేయాలని పరితపిస్తున్నానని
పవన్ కల్యాణ్ అన్నారు.
పవన్ వారాహి యాత్రకు బ్రేక్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు
రెండు రోజులపాటు బ్రేక్ పడింది. పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నట్లు
తెలుస్తోంది. భీమవరంలోనే పవన్ విశ్రాంతి తీసుకోనున్నారు. భీమవరంలో ఈ నెల 30న
జనసేన బహిరంగ సభ జరగనుంది. తూర్పు కాపుల సంక్షేమానికి, వారి సమస్యల
పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని పవన్ కల్యాణ్ అన్నారు. మంగళవారం ఆయన
భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ పోరాట యాత్ర 2014లో శ్రీకాకుళం నుంచే
మొదలుపెట్టానని, ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలస కార్మికులు వస్తుంటారని,
ఉత్తరాంధ్ర కార్మికులు సాహసికులని పేర్కొన్నారు. తూర్పు కాపుల సంఖ్యను టీడీపీ
26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతోందని, కానీ 45 లక్షల మంది
తూర్పుకాపులున్నారని పవన్ అన్నారు. ఏ ప్రాతిపదికన వైసీపీ 16 లక్షలని
చెబుతోంది?.. పథకాలు అందకుండా చేయడానికి వైసీపీ అలా అంటోందని
ఆరోపించారు.
జనసేన అధికారంలోకి వస్తే తూర్పుకాపుల జనగణన చేపడతామని, చట్టంతో అందరికీ న్యాయం
జరిగితే కులాలతో సంబంధం లేదని, తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారని, వారు
ఎదుగుతున్నారు.. కులాన్ని పట్టించుకోవడం లేదన్నది మంత్రి బొత్స సత్యనారాయణ
కూడా ఆలోచించాలని సూచించారు. తూర్పుకాపుల్లో మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేలు
ఉన్నారు. వారు తిన్నాకైనా వారి కులం గురించి ఆలోచించాలన్నారు. ఇతర బీసీ
కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు, తూర్పుకాపులకు
ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏంటన్నారు. తెలంగాణాలో
31 కులాలను బీసీ జాబితా నుంచి తూర్పు కాపులను తొలగించారని, అయినా అప్పటి
నాయకులు పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు
రావాలి. బీసీ కులాల జనగణనకు అనుకూలంగా ఉన్నానని పవన్ తెలిపారు. తాను సీఎం
అయితే అన్నింటికి పరిష్కారం కాదన్నారు. సీఎం అవ్వడం అన్నింటికీ మంత్రదండం
కాదని, తాను సీఎం అయిన తరువాత చేయాలనుకున్నా అధికారులో, నాయకులో
అడ్డుపడతారన్నారు. చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం
లభిస్తుందని, తాను సీఎం అయినా తనను నిలదీసే స్థితికి ప్రజలు రావాలన్నారు.