గుంటూరు : ప్రభుత్వం, అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే గుంటూరులో వందలమంది డయేరియా బాధితులు అయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. గుంటూరులోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, జిల్లా, నగర కార్యదర్శులు పాశం రామారావు, కె నళినీకాంత్ బృందం పర్యటించింది. అనంతరం బ్రాడీపేట సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2018లో కలుషిత మంచినీటి వల్ల 24 మంది చనిపోయినా అధికారులు ఎలాంటి గుణపాఠం నేర్వలేదని అందుకే మళ్ళీ అలాంటి ఘటన పునరావృతం అయిందని అన్నారు. ఈ ఘటనకు కారకులైన అధికారులపై సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. మరణించిన యువతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కు అందించి చేతులు దులుపుకునే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని విమర్శించారు. వెంటనే ఆ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం తక్షణమే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులందరికీ వైద్య చికిత్స అందించడంతో పాటు, వారు కోలుకునే వరకు ఉచితంగా మందులను ఇవ్వాలని, 25 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న ప్రభుత్వం స్వచ్ఛమైన మంచి నీళ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అమృత పథకంలో 24 గంటలు మంచినీళ్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వాలు ప్రస్తుతం కలుషిత నీటిని సరఫరా చేస్తున్నాయన్నారు. పన్నుల వసూళ్ల పై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో కార్పోరేషన్ అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శించారు.
ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదికను ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే గుంటూరు ఘటనపై జోక్యం చేసుకుని దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని, అధికారులతో సమీక్షించాలని కోరారు. గుంటూరు ఘటనపై తక్షణమే మున్సిపల్ శాఖ మంత్రి స్పందించి ఈ సమస్య మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు బి ముత్యాలరావు, జిల్లా కమిటీ సభ్యుడు యం ఎ చిష్టి, ఆది నికల్సన్, షేక్ ఖాశిం షహీద్, ఎస్ కార్తీక్, షేక్ ఖాశిం వలి, షేక్ అబ్దుల్ సలీమ్, దీవెనరావు, ఎ కళ్యాణి ప్రజారోగ్య వేదిక నాయకులు జి శ్రీనివాసరావు, పి ఎస్ శేఖర్ రెడ్డి, టి మురళి కృష్ణ, రేట్ పెయిర్స్ అసోసియేషన్ నాయకులు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.