వైఎస్ జగన్‌కు తూర్పుగోదావరి జిల్లాలో మరో తలనొప్పి
మంత్రి విశ్వరూప్ వర్సెస్ ఎంపీ అనురాధ
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార
పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ మధ్య
‘రామచంద్రాపురం’ గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. రామచంద్రాపురం ఎమ్మెల్యే
టికెట్ తనకు లేదా తన కుమారుడికి ఇవ్వాల్సిందేనని అధిష్టానానికి పిల్లి
అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు తన కుటుంబాన్ని కాదని వేణుకు టికెట్ ఇస్తే
రాజీనామా చేస్తానని కూడా సీఎం వైఎస్ జగన్ రెడ్డిని హెచ్చరించారు. దీంతో అటు
మంత్రిని పక్కనెట్టాలో, ఇటు పార్టీ ఆవిర్భావం నుంచి తనతో కలిసి పనిచేసిన
బోస్‌ను పక్కన పెట్టాలో తెలియక వైఎస్ జగన్ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ
వ్యవహారం జగన్‌కు పెద్దతలనొప్పిగానే మారినట్లయ్యింది. ఇది సద్దుమణగక ముందే ఇదే
ఉమ్మడి జిల్లాలో మంత్రి వర్సెస్ ఎంపీగా పరిస్థితి ఏర్పడింది.
అసలేం జరిగిందంటే : సీఎం వైఎస్ జగన్ రెడ్డి బుధవారం కోనసీమ జిల్లాలోని
అమలాపురంలో పర్యటించాల్సి ఉంది. అయితే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న
నేపథ్యంలో పర్యటన రద్దయ్యిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో
భాగంగా డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను బటన్ నొక్కి జగన్ జమ
చేయాల్సి ఉంది. భారీ వర్షాలతో పర్యటన రద్దయినట్లు కోనసీమ జిల్లా కలెక్టర్
హిమాన్షు శుక్లా తెలిపారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ, ముఖ్యమంత్రి
వస్తున్నారని ఉమ్మడి తూ.గో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భారీగానే
ఏర్పాట్లు చేశారు. అయితే ఈ పర్యటనతో మంత్రి పినిపె విశ్వరూప్ , అమలాపురం ఎంపీ
అనురాధ విబేధాలు బయటపడ్డాయి. సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన
ఫ్లెక్సీలలో ఎక్కడా ఎంపీ అనురాధ ఫొటో కనిపించలేదు. హెలీప్యాడ్ నుంచి మీటింగ్
ప్రదేశం వరకు భారీగా కట్టిన ఫ్లెక్సీలలో ఎంపీ ఫొటోలు ఒక్కచోట కూడా
కనిపించలేదు. దీంతో అనురాధ, ఆమె అనుచరులు, ముఖ్య కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి
లోనయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం అయిన ఎంపీ ఫోటో వేయకపోవడం ఏమిటని స్థానిక
వైసీపీ నాయకులపై అనురాధ కన్నెర్రజేస్తున్నారు.
మొత్తం మంత్రే చేశారా? : ఎంపీ అనురాధ ఫొటో ముద్రించాల్సిన స్థానంలో మంత్రి
విశ్వరూప్ తన కుమారుడు శ్రీకాంత్ ఫొటోలను ఫ్లెక్సీల్లో ముద్రించారు. దీంతో
మంత్రి ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఫ్లెక్సీల్లో ఇతర జిల్లాల నాయకుల ఫోటోలు వేసిన నేతలు స్థానిక ఎంపీ ఫొటో
ఒక్కచోట కూడా వేయకపోవడంపై అనురాధ వర్గీయులు మండిపడుతున్నారు. వాస్తవానికి
మంత్రి-ఎంపీ మధ్య చాలా రోజులుగా ఎడ మొహం, పెడ మొహంగా ఉంటూ వస్తున్నారు. సీఎం
జగన్ రెడ్డి అమలాపురం పర్యటన నేపథ్యంలో మరోసారి ఆ విబేధాలు బట్టబయలయ్యాయి.
అంతేకాదు ఇటీవల సీఎం పర్యటన నేపథ్యంలో నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ
సమావేశానికి కూడా ఎంపీకి పిలుపు లేదని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే ఓ వైపు
రామచంద్రపురంలో మంత్రి వేణు- ఎంపీ బోస్ మధ్య వార్ నడుస్తుండగా తాజాగా
అమలాపురంలో మంత్రి విశ్వరూప్-ఎంపీ అనురాధ మధ్య విబేధాలు బయటపడంతో జగన్‌కు మరో
తలనొప్పి వచ్చిపడినట్లయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రానున్న
ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ బరిలో తన కుమారుడు శ్రీకాంత్‌ను పోటీ
చేయించాలని మంత్రి విశ్వరూప్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇలా
పక్కా ప్లాన్‌తోనే ఎంపీని అవమానిస్తూ వస్తున్నారని ఉమ్మడి తూ.గో జిల్లాలో
నేతలు చర్చించుకుంటున్నారు. ఓకే జిల్లాలో మంత్రులు వర్సెస్ ఎంపీలుగా ఈ
పరిస్థితులను వైఎస్ జగన్ ఎలా పరిష్కరిస్తారో ఏంటో వేచి చూడాలి మరి.