వెలగపూడి : శాసన మండలిలో ఖాళీ అయ్యే స్థానాల భర్తీకి అధికార వైసీపీలో కసరత్తు
మొదలైంది. మార్చి నుంచి మే 1 వరకూ మొత్తం 21 స్థానాలు ఖాళీ కానున్నాయి.
వీటన్నింటినీ కైవసం చేసుకునేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యేల
కోటాలో వైసీపీ కు చెందిన అయిదుగురితో పాటు ఇద్దరు టీడీపీ సభ్యుల పదవీ కాలం
ముగుస్తోంది. ఈ ఏడు స్థానాలూ వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. స్థానిక సంస్థల
కోటాలో ఖాళీ అయ్యే 9 స్థానాలూ ప్రస్తుతం తెదేపావే. ఇప్పుడు వాటినీ కైవసం
చేసుకునేందుకు వైసీపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 21 ఖాళీలుండగా
వాటిలో ఒకటి ఎస్టీలకు కేటాయిస్తారని తెలిసింది. బీసీల్లోనూ ఇప్పటివరకూ అవకాశం
దక్కని, పలు నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సామాజికవర్గాల వారిని ఎంపిక
చేయనున్నారు.
ఎమ్మెల్యే కోటాలో అవకాశం వీరికేనా : ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన డొక్కా
మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, గంగుల ప్రభాకర్‌రెడ్డి, సూర్యనారాయణ రాజు,
దివంగత చల్లా భగీరథరెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. వీరిలో డొక్కా,
పోతుల సునీతలను మళ్లీ కొనసాగించే అవకాశమున్నట్లు సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.
విజయనగరం జిల్లాకు చెందిన సూర్యనారాయణ రాజును కొనసాగించడం అనుమానమే. అదే
జిల్లా నుంచి ఆయన సామాజిక వర్గానికే చెందిన రఘురాజు ఎమ్మెల్సీగా ఉన్నారు.
చల్లా భగీరథరెడ్డి ఇటీవల మృతి చెందారు. అంతకుముందు ఆయన తండ్రి చల్లా
రామకృష్ణారెడ్డి మృతితో ఆయన ఎమ్మెల్సీ పదవినే భగీరథరెడ్డికి ఇచ్చారు. ఇప్పుడు
ఆయన కుటుంబ సభ్యులకు అవకాశమిస్తారా అనే దానిపై చర్చ జరుగుతోంది.
భగీరథరెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి ఇటీవలే సీఎం జగన్‌ను కలిశారు. ఆమె
కుటుంబానికి ఎమ్మెల్సీ అవకాశమిస్తే నంద్యాల జిల్లా పరిధిలోకొచ్చే గంగుల
ప్రభాకర్‌రెడ్డి కొనసాగింపుపై ప్రభావం పడనుంది. ఇదే కోటాలో టీడీపీ కి చెందిన
బచ్చుల అర్జునుడు, నారా లోకేశ్ పదవీ కాలం మార్చి 29నే ముగియనుంది. అర్జునుడు
కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ స్థానాన్ని గన్నవరంలో సర్దుబాటులో
భాగంగా యార్లగడ్డ వెంకట్రావు, లేదా దుట్టా రామచంద్రరావుల్లో ఒకరికి ఇవ్వచ్చన్న
చర్చ జరుగుతోంది. గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీ
సమన్వయకర్తగా ఉన్నారు. టికెట్ విషయంలో ఆయనతో యార్లగడ్డ, దుట్టా పోటీ
పడుతున్నారు.