మచిలీపట్నం : గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలలో అనీమియా నివారణకు
సూక్ష్మ స్థాయిలో చర్యలు తీసుకోవాలని తద్వారా ఆరోగ్యవంతమైన సమాజానికి కృషి
చేయాలని సీఈఓ టు సీఎం డాక్టర్ సమీర్ శర్మ అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో
పర్యటించిన ఆయన తొలుత కలెక్టరేట్ సమావేశపు హాల్లో సుస్థిరాభివృద్ధి
లక్ష్యాలకు సంబంధించి 8 ప్రధాన సూచికలలో జిల్లా ప్రగతిపై సమీక్షించారు.
జిల్లాలో మండల, సచివాలయాల వారీ గర్భవతులు, బాలింతలు, 10-19 సంవత్సరాల మధ్య
వయస్సు గల కిశోర బాలికలు, వారిలో అనీమియా బాధితులు, జగనన్న గోరుముద్ద,
బాలామృతం వంటి పథకాల కింద అనీమియా బాధితులకు అందిస్తున్న పౌష్టికాహారం,
అనీమియా నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
సమీర్ శర్మకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తొలుత జిల్లా
కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాల విభజన అనంతరం కృష్ణాజిల్లా 3
రెవెన్యూ డివిజన్లు, 25 మండలాలతో ఏర్పడిందని, 17.35 లక్షల జనాభా ఉందని, 104
వార్డు సచివాలయాలు, 404 గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. సుస్థిరాభివృద్ధి
లక్ష్యాలకు సంబంధించి ప్రధాన సూచికలలో మెరుగైన లక్ష్య సాధనకు తీసుకుంటున్న
చర్యల్లో భాగంగా జిల్లాలో గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలకు నూరు శాతం
వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సచివాలయాల వారీగా సర్వే
నిర్వహించి ఎనీమిక్ బాధితులను గుర్తించి వారికి అవసరమైన పౌష్టికాహారం,
విటమిన్స్ అందేలా చూస్తున్నట్లు తెలిపారు. మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు
చేశామని, అనీమియా నివారణకు తీసుకుంటున్న చర్యలపై ప్రతి వారం సమీక్షించాలని
ఎంపీడీఓలను ఆదేశించారు. సమీర్ శర్మ మాట్లాడుతూ.. ముఖ్యంగా అనీమియా బాధితులలో
సివియర్ కేసులపై దృష్టి సారించి వారిలో ఎనీమిక్ నివారింపబడుటకు చర్యలు
తీసుకోవాలన్నారు. సచివాలయాల వారీగా అనీమియా బాధితులపై దృష్టి పెట్టి ప్రతి
ఒక్కరూ అనీమియా నుండి నివారణ పొందేవరకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు
ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలో 10-19 సం.
మధ్య వయస్సు గల కిశోర బాలికలు 78,138 కాగా వీరిలో ఎనీమిక్ 61.67 శాతం కాగా 20
శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. 15-49 సం. మధ్య వయస్సు గల మహిళల్లో
గర్భవతులు 12 వేల మందికి పైగా ఉన్నారని, వారిలో ఎనీమిక్ గత అక్టోబర్ మాసంలో
39.38 శాతం కాగా, డిసెంబర్ నాటికి 32.14 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. 0-5
సం. పిల్లల్లో ఎత్తు తక్కువ గల వారు 4,352 మంది, బరువు తక్కువ పిల్లలు 2,585
మందిని గుర్తించగా, వీరికి వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకర కింద పౌష్టికాహారం
అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1-8 తరగతులలో గుర్తించిన డ్రాస్అవుట్స్
1,969 మంది విద్యార్థులు కాగా, వీరి తల్లిదండ్రులకు తగిన కౌన్సిలింగ్, అవగాహన
కల్పించడం ద్వారా 352 మందిని తిరిగి తరగతుల్లో చేర్పించగా మిగతా వారిని కూడా
బడిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.