న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో
రాజీనామా చేస్తానని ప్రకటించారు. 2017లో ఆమె న్యూజిలాండ్ ప్రధానిగా
ఎన్నికయ్యారు. తిరిగి ఎన్నికను తాను కోరుకోవడం లేదని ప్రకటించారు. లేబర్
పార్టీ సభ్యులకు ఆమె తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ ఏడాది అక్టోబర్ లో అక్కడ
సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మరో విడత అధికారాన్ని కోరరాదని
నిర్ణయించుకున్నట్టు జసిండా తెలిపారు. తాను తన బాధ్యతలకు న్యాయం చేయలేనని ఆమె
స్పష్టం చేశారు. కన్నీళ్లను నియంత్రించుకుంటూ తన నిర్ణయాన్ని పార్టీ సభ్యులకు
తెలియజేశారు. ప్రధానిగా ఐదున్నరేళ్లు తనకు క్లిష్టమైన సమయంగా ఆమె
పేర్కొన్నారు. ‘‘నా నిర్ణయంపై పెద్ద చర్చ జరుగుతుందని తెలుసు. ఆరేళ్ల కాలంలో
ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కొన్న నేను కూడా మనిషినే. రాజకీయ నాయకులు కూడా
మనుషులే. మనం పని చేయగలిగినంత కాలమే కొనసాగాలి. ఆ తర్వాత సమయం వస్తుంది.
ఇప్పుడు నాకు సమయం వచ్చింది’’ అని జసిండా తెలిపారు. జసిండా నిర్ణయంతో అధికార
లేబర్ పార్టీ వచ్చే ఆదివారం భేటీ అయి కొత్త నేతను ప్రధాని పదవికి
ఎన్నుకోనుంది. ఈ ఏడాది అక్టోబర్ 14 సాధారణ ఎన్నికల వరకు కొత్తగా ఎన్నికయ్యే
వ్యక్తి ప్రధాని పదవిలో ఉంటారు. జసిండా ఫిబ్రవరి 7 లోపు పదవి నుంచి
తప్పుకుంటారు. కాగా జసిండా అనూహ్య నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.