వైసీపీ ఎంపి విజయ సాయిరెడ్డి
విజయవాడ : ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై అంతర్జాతీయ మీడియా
దృష్టి సారించిందని, 21వ శతాబ్దంలో జరిగిన ఈ అతి పెద్ద రైలు దుర్ఘటన వివరాలు
ఇస్తూనే భారత రైల్వేల చరిత్రను, దాని విశిష్ఠతను ఈ ప్రపంచ వార్తాసంస్థలు
అందరికీ తెలియజేస్తున్నాయని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా సోమవారం ఈ అంశానికి
సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. బ్రిటిష్ వారి పాలనలోని భారతదేశంలో
1853లో అంటే 170 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన భారత రైల్వే వ్యవస్థ శరవేగంతో
అభివృద్ధి సాధించింది. దేశంలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చడమేగాక, ఇతర
సాంప్రదాయ సరకు రవాణా పద్ధతులతో పోల్చితే రైల్వేలు అంతే సామర్ధ్యంతో, ఇంకాస్త
చౌకగా వస్తు రవాణా చేయడం ద్వారా భారత ప్రగతిలో కీలకపాత్ర పోషిస్తోందని
అన్నారు. 1991 నుంచీ దేశ ఆర్థికవ్యవస్థతో పాటే రోడ్డు మార్గాలు విపరీతంగా
విస్తరించినా గాని పెరుగుతున్న వాణిజ్య అవసరాలకు అనుగుణంగా భారత రైల్వేలు
వృద్ధిచెందాయేగాని వెనుకబడ లేదు, భారతదేశంలో నలుమూలలకూ విస్తరించిన భారత
రైల్వేల రైలు పట్టాల వ్యవస్థ మ్తొత్తం విస్తీర్ణం 2022 మార్చి 31 నాటికి
1,28,305 కిలోమీటర్లు కాగా, రైళ్లు నడిచే పట్టాల (రైలు ట్రాక్) పొడవు
1,02,831 కి.మీ. అందులో అన్ని రైలు మార్గాల రూట్లు కలిపి చూస్తే వాటి మొత్తం
పొడవు 68,043 కి.మీ. 1853లో మొదలైన భారత రైల్యేల ప్రయాణం వేగంగా ముందుకు
సాగడంతో 1880 నాటికి 9000 మైళ్ల పొడవైన రైలు మార్గాల స్థాయికి చేరిందని
అన్నారు.
దక్షిణాది నగరం మద్రాసులోనే కదిలిన మొదటి (గ్రానైట్ లోడుతో) భారత రైలు!
1953 ఏప్రిల్ 16న భారత రైల్వేల మొదటి రైలు బొంబాయి నుంచి ఠాణె మధ్య లాంఛనంగా
పట్టాలపై నడవడంతో ప్రారంభోత్సవం జరిగిందని చరిత్ర.చెబుతోందని అన్నారు. నాటి
నగరం బొంబాయితో సమీపంలోని ఠాణె, కల్యాణ్ వంటి ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా
కలపాలనే ఆలోచన 1843లో బొంబాయి ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ జార్జ్ క్లార్క్
బొంబాయి సమీపంలోని భాండప్ ప్రాంతానికి వచ్చినప్పుడు కలిగింది. వెంటనే రైలు
మార్గాల నిర్మాణ ప్రయత్నాలు మొదలబెట్టడంతో ఈ ఆలోచన పదేళ్లకు వాస్తవ రూపం
దాల్చింది. 21 మైళ్ల దూరం ఉన్న ఈ రూటు మొదటి రైలులోని 14 బోగీల్లో దాదాపు 400
మంది అతిధులు బోరీ బందర్ లో రైలెక్కి ప్రయాణించారు. తర్వాత, తూర్పు తీరంలోని
బెంగాల్ లో కలకత్తా నగరం సమీపంలోని హౌరా (బెంగాలీలో హావ్డా) నుంచి హుగ్లీకి
మొదటి ప్రయాణికుల రైలు 1954 ఆగస్ట్ 15న బయల్దేరింది. ఈ రెండు కొత్త రైల్వే
స్టేషన్ల మధ్య దూరం 24 మైళ్లు. భారత ఉపఖండం తూర్పు భాగానికి మొదటి రైలు
మార్గాన్ని ఈస్టిండియన్ రైల్వే సంస్థ ఇలా ప్రారంభించింది. తర్వాత దక్షిణాదిలో
మొదటి రైల్వే లైను ప్రారంభించారు. 1856 జులై 1న మద్రాస్ రైల్వే కంపెనీ
మద్రాసు నగరంలోని వ్యాసరపాడి జీవ నిలయం (వెయసరపాండి), వాలాజారోడ్డు మధ్య మొదటి
ప్రయాణికుల రైలు నడిపింది. ఈ రైలు మార్గం దూరం 63 కి.మీ. అయితే, దేశంలో మొదటి
రైలు 1853లో నాటి బొంబాయి నగరంలో బయల్దేరిందని చెబుతారు గాని అసలు రైలు అనేది
రైలు మార్గంపై నడించింది మాత్రం నాటి మద్రాసు నగర ప్రాంతంలోనే. 1837లోనే
నగరంలోని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట్ బ్రిడ్జికి మొదటి రైలును రెడ్
హిల్ రైల్వే సంస్థ నడిపింది. కాని, ఇది ప్రయాణికుల రైలు కాదు. ప్రఖ్యాత
ఈస్టిండియా కంపెనీ ఇంజినీరు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు గ్రానైట్ రవాణా
చేయడానికి ఈ రైలును తయారుచేశాడని అన్నారు.
గ్రానైట్ రవాణాతో మొదలైన గూడ్సురైళ్లే భారతరైల్వేలకు తెచ్చేది 74% ఆదాయం
పైన వివరించినట్టు మద్రాసు నగరంలో గ్రానైట్ రాయి రవాణాతో మొదలైన భారత రైల్వేల
గూడ్సు రైళ్లు 1837 నుంచీ అనూహ్య రీతిలో విస్తరించాయని విజయసాయిరెడ్డి
తెలిపారు. ఫలితంగా ప్రస్తుతం భారత రైల్వేల ఆదాయంలో 74 శాతం సరకు రవాణా గూడ్సు
రైళ్ల వ్యవస్థ ద్వారానే ప్రభుత్వానికి వస్తోంది. ఆసక్తికర అంశం ఏమంటే–చివరికి
ఆటోమొబైల్ కంపెనీలు సైతం తమ వాహనాలను గూడ్సు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు
పంపుతున్నాయి. 2027 నాటికి ఇలాంటి రవాణాను 30% పెంచాలని ఈ ఆటోమొబైల్ కంపెనీలు
లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇలా అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్న
భారత రైల్వేలు 2019 నుంచీ మరింత వేగంగతో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేసే
‘వందే భారత్’ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా గత ఐదేళ్లుగా పత్రికల మొదటి పేజీ
వార్తల్లో నిలుస్తున్నాయి. ఇది వందే భారత్ యుగమని ప్రజలు ఆనందిస్తున్న సమయంలో
ఒడిశాలో శుక్రవారం జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఒక్కసారిగా దేశాన్ని తీవ్ర
విషాదంలోకి నెట్టివేసింది. అయితే, భారత రైల్వేలు ఇలాంటి అనేక సవాళ్లను
తట్టుకుని ధైర్యంగా నిలబడ్డాయి. ప్రతి దుర్ఘటన తర్వాతా ఎన్నో పాఠాలు
నేర్చుకుని ముందుకుసాగుతున్నాయి. ఒడిశా ప్రమాదం నుంచి కూడా ఎంతో నేర్చుకుని
భారత రైల్వేలు శరవేగంతో ముందుకు పరుగెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదని
విజయసాయిరెడ్డి అన్నారు