తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో అగ్రస్థానం
స్వాతంత్య్ర దిన వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ : వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను ఢీకొంటూ దేశంలోనే తెలంగాణ
ప్రథమస్థానానికి పోటీపడుతోందని, భారాస ఏలుబడిలో సాగు సుసంపన్నమైందని సీఎం
కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే కొంతమంది
అల్పబుద్ధితో రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని సీఎం
ధ్వజమెత్తారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్తు చాలంటూ విపరీత వ్యాఖ్యలు
చేస్తున్నారని మండిపడ్డారు. ‘నేడు తెలంగాణ నిరంతర విద్యుత్తుతో వెలుగులు
విరజిమ్ముతోంది. పంట కాలువలతో, పచ్చని పొలాలతో కళకళలాడుతోంది. మండే ఎండల్లో
కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. కాళేశ్వర జలధారలు సాగుభూములను
తడుపుతున్నాయి. చుక్క నీటి కోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు ఇరవైకి పైగా
రిజర్వాయర్లతో పూర్ణకలశంలా తొణికిసలాడుతోంది. మూడు కోట్ల టన్నుల ధాన్యం
దిగుబడితో.. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోంది. ఈ పురోగమనం
ఇలాగే కొనసాగేలా ప్రజలు ఆశీర్వదించాలని మనవి చేస్తున్నాను’ అని సీఎం కేసీఆర్
కోరారు. గోల్కొండ కోటలో మంగళవారం నిర్వహించిన 77వ స్వాతంత్య్ర దినోత్సవంలో
ముఖ్యమంత్రి ప్రసంగించారు. తొలుత కోటగుమ్మం వద్ద సీఎంకు పోలీసులు గౌరవ వందనం
సమర్పించారు. రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో 1200 మంది కళాకారులు 34
కళారూపాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన రాణిమహల్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర,
సురేశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు,
కార్పొరేషన్ల ఛైర్మన్లు, సీఎస్ ఎ.శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పలు శాఖల
కార్యదర్శులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రగతి సూచికల్లో ముందు : ‘76 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే
అయినా.. ఆశించిన లక్ష్యాలను ఇంకా చేరలేదనే చెప్పాలి. పాలకుల అసమర్థత ఫలితంగా
వనరుల సద్వినియోగం జరగడం లేదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల
జీవితాల్లో పేదరికం తొలగిపోలేదు. దేశ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో శాంతియుత
పంథాలో తెలంగాణను సాధించుకున్నాం. ప్రజలంతా ఒక్కతాటిపై నిలిచి చేసిన ఉద్యమం
ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలిసిన మా
ప్రభుత్వం అన్ని రంగాలనూ ప్రక్షాళన చేసింది. ప్రగతికి కొలమానాలైన తలసరి ఆదాయం,
తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. అన్ని
రంగాలకూ 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా
చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆవిర్భవించింది. మిషన్ కాకతీయ, పెండింగ్
ప్రాజెక్టులు, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఇతర
ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల అనుసంధానం తదితర చర్యలతో సాగునీటి రంగంలో
తెలంగాణ స్వర్ణయుగాన్ని సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకంగా
దళితబంధు దేశానికి దిక్సూచిగా నిలిచింది. బీసీల్లోని వృత్తిపనుల వారికీ,
మైనారిటీ వర్గాలకూ రూ.లక్ష చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. 1.50
లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై యాజమాన్య
హక్కులు కల్పించింది. హైదరాబాద్‌లో లక్ష రెండు పడకగదుల ఇళ్లను ఈ రోజు నుంచే
పేదలకు పంపిణీ చేస్తోంది. సొంతస్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు
గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు.
ఉద్యోగులకు మెరుగైన వేతనాలు : నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది
తెలంగాణ ఉద్యోగులే. త్వరలోనే కొత్త పీఆర్సీని నియమించి, మరింత మెరుగైన వేతనాలు
ఇస్తామని, మధ్యంతర భృతి చెల్లిస్తామని ఇటీవల శాసనసభలో ప్రకటించాను. సింగరేణి
టర్నోవర్‌ను రూ.12 వేల కోట్ల నుంచి రూ.33 వేల కోట్లకు పెంచిన ఘనత మా
ప్రభుత్వానిదే. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండగల బోనస్‌గా రూ.వెయ్యి
కోట్లు పంపిణీ చేయబోతున్నాం. 43,373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో
విలీనం చేయాలని నిర్ణయిస్తే.. సంకుచిత శక్తులు ఆ బిల్లును అడ్డుకోవడానికి
ప్రయత్నించి విఫలమయ్యాయన్నారు.
వైద్యరంగంలో అద్భుత ప్రగతి : తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో మూడే వైద్య
కళాశాలలుండేవి. జిల్లాకొక వైద్య, నర్సింగ్ కళాశాల ఉండాలనే లక్ష్యంతో మా
ప్రభుత్వం 21 వైద్య కశాళాలలను ప్రారంభించి చరిత్ర సృష్టించింది. మరో 8 కాలేజీల
ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కంటి వెలుగు, ఉచిత డయాలసిస్, ఉచిత
డయాగ్నొస్టిక్ సెంటర్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సహా అనేక కార్యక్రమాలు
యావద్దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్
స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించుకుంటున్నాం. వరంగల్‌లో రూ.1100 కోట్లతో 2వేలకు
పైగా పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మితమవుతోంది. మరో 2 వేల
పడకల ఏర్పాటుతో ‘నిమ్స్’ను విస్తరిస్తున్నాం. రాష్ట్రంలో వెయ్యికి పైగా
గురుకుల జూనియర్ కళాశాలలు కొలువుదీరటం భారాస ప్రభుత్వం సృష్టించిన నూతన
చరిత్ర. హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం. 26 వేలకు పైగా పాఠశాలలను
సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నాం. హైదరాబాద్‌లో ప్రభుత్వం రూ.67,149
కోట్లతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మహానగరం
నలువైపులకూ 415 కిలోమీటర్లకు మెట్రో రైలును విస్తరించాలని నిర్ణయించింది.
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామాలు, పట్టణాలు చక్కని మౌలిక
వసతులతో అలరారుతున్నాయన్నారు.