నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా
మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా
విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం
11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు
ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల
చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న
విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తోంది.
తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని
పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్
ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది.
గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు : గత ప్రభుత్వం హయాంలో పూర్తి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా
కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.
పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు
అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా గత
ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న
విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు
పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది.
ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం
దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా
అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం.
ఎప్పటి నిధులు అప్పుడే జమ : ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్,
మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన
పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం
ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద
విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం
కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్
విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు
అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. కార్యక్రమంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలకు మన ఇచ్చే ఆస్తి
చదువే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం.
పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్సార్ ఫీజు
రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన
పడ్డారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విద్యారంగంలో అనేక
సంస్కరణలు తెచ్చాం. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అని చెప్పారు.