ప్రతి మున్సిపాలిటీలో మినీ స్టేడియాల నిర్మాణం
పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్ : భావితరాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని
మున్సిపాలిటీల్లో ‘స్వచ్ఛ బడి’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని రాష్ట్ర
పురపాలక, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని
శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘స్వచ్ఛ బడి అమలు కోసం రూ. 71 కోట్లు
కేటాయిస్తున్నాం. విద్యార్థి దశ నుంచి పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన
కల్పించాలని ఆలోచన. ఈ స్వచ్ఛబడి ప్రాంగణానికి ప్రతి రోజూ 50 మంది విద్యార్థులు
వచ్చేలా చర్యలు తీసుకోవాలి. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన స్వచ్ఛబడి పథకం ఎంతగానో
ఆకట్టుకుంది. దాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించాం.
పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం. మున్సిపాలిటీల్లో ఉన్న డంపింగ్
యార్డుల్లో బయోమైనింగ్ కోసం రూ. 178.60 కోట్లు కేటాయించాం. రానున్న
అయిదేళ్లలో అత్యధిక జనాభా పట్టణాల్లోనే ఉంటుంది. అందుకే పట్టణాల్లో వ్యూహాత్మక
ప్రణాళిక ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. హైదరాబాద్ నగర ప్రజలకే
కాదు.. అవుటర్ రింగు రోడ్డు అవతల అయిదు కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి
కూడా నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాం. 2050 సంవత్సరం వరకు హైదరాబాద్
జనాభా ఎంత పెరిగినా నీటిని సరఫరా చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించాం.
ప్రతి మున్సిపాలిటీలో మినీ స్టేడియంలను నిర్మిస్తాం. పట్టణాలే అభివృద్ధి
ఇంజిన్లు. రాష్ట్రానికి హైదరాబాద్ పరిసరాల నుంచే 40 నుంచి 45 శాతం ఆదాయం
వస్తోంది.
ఎగుమతులు.. దిగుబడులు పెరుగుతున్నాయి : రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు అంచనాలకు
మించి పెరుగుతున్నాయి. నీటి వనరులు సమృద్ధిగా ఉండడంతో ధాన్యం దిగుబడి భారీగా
వృద్ధి చెందుతోంది. ఐటీ ఎగుమతులు గత తొమ్మిదేళ్లలో రూ. 9.05 లక్షల కోట్లకు
పెరిగాయి. ఉద్యోగ కల్పనలో బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. పట్టణాలు,
పల్లెలు ఏకకాలంలో అభివృద్ధి సాధిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా,
గద్వాల నుంచి భద్రాచలం దాకా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి
ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మౌలిక వసతుల ఏర్పాటు, నిర్వహణ కోసం పట్టణ ప్రగతి
కింద రూ.4,537 కోట్లు విడుదల చేశాం. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం
రూ.4,706 కోట్లు కేటాయించాం. రూ. 7,100 కోట్లతో తొలిదశ మిషన్ భగీరథతో
పట్టణాలకు తాగునీరందిస్తున్నాం.
ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి : హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే
ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడాలి. ఆ దిశగా ప్రభుత్వం వివిధ ప్రణాళికలను
రూపొందిస్తోంది. దేశంలోని అత్యంత మెరుగైన జీవన ప్రమాణాలున్న నగరాల్లో
హైదరాబాద్ వరుసగా అయిదేళ్లపాటు నిలిచింది. ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి
100 శాతం మురుగునీటి శుద్ధి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఘనత సాధించనున్న తొలి
నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది. మరో 14 వంతెనలు నిర్మించాలి. ఇంకా చేయాల్సినవి
చాలా ఉన్నాయి.
ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని : ప్రజలకు స్వేచ్ఛ ఉండాలన్న ఉద్దేశంతోనే
టీఎస్‌బీపాస్, స్వయం పన్ను మదింపు తీసుకువచ్చాం. పరిశ్రమలకైనా, నివాస
గృహాలకైనా వేగంగా అనుమతులిస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. ఈ
విషయంలో సిఫార్సులు, లంచాల మాటే లేదు. ప్రభుత్వ విధానాలను విజయవంతంగా ముందుకు
తీసుకెళుతున్న ఘనత రాష్ట్రంలోని ఆరున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు
దక్కుతుంది. అభివృద్ధి చేస్తున్న మా ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి
ఆశీర్వదిస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి నివేదికను
ఆవిష్కరించారు.