గుంటూరు : మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముస్లింల్లో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్ అని, పదవుల నుంచి సంక్షేమం వరకూ అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. శుక్రవారం మైనార్టీ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడప్ ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చామని, నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చామని, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించామన్నారు. మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ. 10,309 కోట్లు అందించామని, నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 10 వేల కోట్లు అందించామని వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు రూ. 2,665 కోట్లు ఇస్తే మూడేళ్లలోనే మేము రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చామని, వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఇప్పటికే అన్యాక్రాంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని, ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దని పేర్కొన్నారు.