హైదరాబాద్ : తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై కఠిన
చర్యలొద్దని, తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర
ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గత ఆదేశాల మేరకు వివేకా
హత్య కేసులో ఎంపీ పాత్రపై ఆధారాలను సీబీఐ సమర్పించింది. దర్యాప్తు కీలకదశలో
ఉన్నందున స్టే ఇవ్వొద్దని వాదించింది. ఇవాళ సీబీఐ విచారణకు మినహాయింపు
ఇవ్వాలన్న ఎంపీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మాజీ మంత్రి
వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్
చేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు విచారణకు పిలవకుండా
ఆదేశాలు ఇవ్వాలంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ
హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపారు.
ఆధారాలు ధ్వంసం చేయడంలో అవినాష్ కీలక పాత్ర
వివేకా హత్య సమయంలో రాసిన లేఖను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపి నివేదిక తెప్పించి
దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. వివేకా రాత నమూనాను
పరీక్షించి.. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వెల్లడించిన
అభిప్రాయాన్ని సమర్పించామని పేర్కొంది. ఏ అంశాన్నీ వదిలి పెట్టడం లేదని
నివేదించింది. హత్య జరిగిన రోజు 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఘటనా స్థలంలో
ఆధారాలు ధ్వంసం చేయడానికి అవినాష్ రెడ్డి ప్రయత్నించారన్నారు. ఈ కేసు గురించి
పూర్తి సమాచారం అవినాష్ వద్ద ఉందన్నారు.
అనుమతిస్తే సంప్రదాయంగా మారుతుంది
దర్యాప్తులో సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ దశలో స్టే మంజూరు చేస్తే
దర్యాప్తు పట్టాలు తప్పుతుందన్నారు. పిటిషనర్ అభ్యర్థించినట్లుగా ఆడియో,
వీడియో రికార్డింగ్ జరిపామని.. అందువల్ల ఎలాంటి ఉత్తర్వులూ అవసరం లేదన్నారు.
విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించామని, ఐతే విచారణ గదిలోకి అనుమతించలేమని
చెప్పారు. వీడియో, ఆడియో రికార్డింగ్ జరిపినపుడు న్యాయవాదిని సమీపంలోకి
అనుమతిస్తే ఇబ్బంది ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు అనుమతిస్తే ఇది
సంప్రదాయంగా మారుతుందని సీబీఐ న్యాయవాది జవాబిచ్చారు.
సీబీఐ, సునీత సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు
అంతకుముందు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు
వినిపించారు. తాము అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసిన కొంతసేపటికే సునీతకు
సమాచారం వెళ్లడం, ఆమె ఇంప్లీడ్ పిటిషన్ వేయడం చూస్తుంటే.. సీబీఐ, సునీత
సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు ఉందన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని,
దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ నెల 7న సీబీఐ డైరెక్టర్‌కు వినతి పత్రం
పంపినట్లు తెలిపారు.
దర్యాప్తు కొనసాగుతుంటే సమావేశాలు ఎలా నిర్వహిస్తారు..?
వివేకా హత్య కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోరాదని, తదుపరి విచారణ చేయకుండా
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్లపై ఉత్తర్వులు వెలువరించేదాకా ఎంపీ
అవినాష్ రెడ్డిపై అరెస్టు సహా కఠిన చర్యలు తీసుకోరాదంటూ సీబీఐని తెలంగాణ
హైకోర్టు ఆదేశించింది. పార్లమెంట్ సమావేశాల కారణంగా మంగళవారం సీబీఐ ముందు
హాజరు నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న అవినాష్‌రెడ్డి అభ్యర్థనను
తిరస్కరించింది.