మరోసారి వివాహం చేసుకున్న హార్దిక్ పాండ్యా, స్టాంకోవిచ్
టీమిండియా టీ20 కెప్టెన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య- నటి, మోడల్ నటాషా
స్టాంకోవిచ్ ల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేడుకగా జరిగింది.
వీరిద్దరూ ఇదివరకే చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు,
సన్నిహితుల మధ్య క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మళ్లీ ఒక్కటయ్యారు.
వీరిద్దరికీ అగస్త్య అనే బాబు ఉన్నాడు. భారత ఆటగాడు హార్దిక్ పాండ్య, నటాషాలు
మూడేళ్ల క్రితం చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2020 మే, 31న తాము వివాహం
చేసుకున్నట్లు వీరిరువురూ ప్రకటించారు. జూలై 2020లో నటాషా అగస్త్యకు
జన్మనిచ్చారు. అప్పుడు కొవిడ్ పాండమిక్ కారణంగా వీరు ఘనంగా పెళ్లి
చేసుకోలేకపోయారు. అందుకనే ఇప్పుడు ఫిబ్రవరి 14న క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం
వీరు మళ్లీ వివాహం చేసుకున్నారు.
హార్దిక్ పాండ్య తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో
పంచుకున్నారు. ‘మూడేళ్ళ క్రితం మేము చేసుకున్న ప్రతిజ్ఞలను
పునరుద్ధరించుకున్నాం. వివాహం ద్వారా ఈ ప్రేమ ద్వీపంలో ప్రేమికుల రోజును ఇలా
జరుపుకున్నాం. ఈ సమయంలో మా కుటుంబం, స్నేహితులు మాతో ఉన్నందుకు మేం చాలా
సంతోషంగా ఉన్నాం’ అని పాండ్య అన్నాడు.