విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేయమని అమిత్ షా చెప్పాలి
వైసీపీ బిజేపితో కలిసి ఉమ్మడి శ్వేత పత్రం విడుదలకైనా జగన్ ముందుకు రావాలి
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 ఏళ్ళుగా తీరని అన్యాయం, ద్రోహం చేసిన
పార్టీ బిజేపి అనీ, అబద్ధాలకు నెంబర్ వన్ అగ్ర నాయకుడు మోడీ అయితే నెంబర్ టూ
అమిత్ షా అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ విమర్శించారు. కేంద్రం
లోని మోడీ ప్రభుత్వం 9 ఏళ్ళుగా ఆంధ్ర ప్రదేశ్ కు ఎంత సాయం చేసిందో వివరించి
చెప్పేందుకు బిజేపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ నెల 10న శ్రీ కాళ హస్తి కి, 11న
విశాఖ కు అమిత్ షా వస్తున్న సందర్భంగా 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున
కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుందని గౌతమ్ వివరించారు. ఆంధ్రుల హక్కు, ఆత్మగౌరవం
గా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటీకరణ చేయమని అమిత్ షా చెప్పాలని
కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నదన్నారు. ఏపికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్,
విజయవాడ, విశాఖ, తిరుపతి మెట్రో రైలు, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని
అంశాలపై బిజేపి ఇప్పటి వరకు 9 ఏళ్ళుగా ఎన్నో అబద్ధాలు చెప్పి అన్యాయం చేసిందని
గౌతమ్ గుర్తు చేశారు. మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో జరిగిన విలేఖరుల
సమావేశంలో గౌతమ్ మాట్లాడారు.
బీజేపీతో రహస్య అవగాహనతో ఇంతకాలం పాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఏపీకి బిజేపి చేసిన అన్యాయాలపై బహిరంగంగా ప్రజల తరపున నిలదీయటానికి ముందుకి
రాగలరా ? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదేయలేక పోతే గత 4 ఏళ్ళుగా
రాష్ట్రానికి బిజేపి చేసిన సాయం పైన , వైసీపీ బిజేపి తో కలిసి ఉమ్మడి శ్వేత
పత్రం విడుదలకైనా జగన్ ముందుకు రావాలని కోరారు. 2018లో బిజేపి ద్రోహంపై ధర్మ
పోరాట దీక్ష లు చేసిన చంద్రబాబు ఇటీవల మళ్ళీ అమిత్ షాను కలిసి రహస్య చర్చలు
జరిపడం , పొత్తులపై అవగాహన చేస్తున్నట్టు వార్తలు రావడం చూస్తుంటే చంద్రబాబు
రాజకీయ విధానం అనైతిక రాజకీయాలకు పరాకాష్టని, 5 కోట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి
ద్రోహం చేయడమేనని గౌతమ్ విమర్శించారు. వైసీపీ 4 ఏళ్ల పాలన సందర్భంగా
కేంద్రానికి జగన్ లొంగిపోయారని విమర్శించిన చంద్రబాబు రెండు రోజులు గడవక ముందే
అమిత్ షా ను కలవడం పచ్చి రాజకీయ దివాళా కోరుతనం అని, ఆంధ్ర ప్రదేశ్ కి ద్రోహం
చేసిన వాళ్ళతో రహస్య చర్చలు చేయడం కూడా 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు ద్రోహం
చేయడమేనని గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీ,టీడీపీలు బీజేపీతో
పొత్తులకు రహస్య అవగాహనతో వెంపర్లాడుతున్న నేపథ్యంలో బిజెపి వ్యతిరేక శక్తుల
న్నింటినీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కూడగట్టి ప్రజా ప్రత్యామ్నాయాన్ని
నిర్మించే కృషి చేస్తుందని గౌతమ్ చెప్పారు. రాష్ర్టంలో వామ పక్షాలు, ప్రత్యేక
హోదా అమలు కోసం ఉద్యమిస్తున్న సంఘాలు, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించానికి
ముందుకు వచ్చే ప్రజాస్వామిక శక్తులు కలిసి ఐక్య రాజకీయ పోరాటానికి ముందుకు
వస్తె ప్రజలకు భరోసా కలుగుతుందని, ఈ కృషి లో కాంగ్రెస్ ముందు వుంటుందని గౌతమ్
భవిష్యత్ కార్యచరణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ నియోజకవర్గాలకు
ఇంచార్జి వ్యవస్థ లేదని, ప్రతి అసెంబ్లీ లో పార్టీ ముఖ్యులతో సమన్వయ కమిటీలను
ఏర్పాటు చేస్తున్నామని, అలాగే మండల స్థాయి నించి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో
పార్టీ నూతన కమిటీలను ఎర్పాటు చేయనున్నట్లు గౌతమ్ ప్రకటించారు. విలేఖరుల
సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహ రావు, ఏఐసీసీ సభ్యులు మీసాల
రాజేశ్వరరావు, కొరివి వినయ్ కుమార్, గురునాధం, మన్నం రాజశేఖర్, జంద్యాల
శాస్త్రి, బాలు తుమాటి, సిటీ కాంగ్రెస్ నాయకులు జగన్నాధం, తదితరులు
పాల్గొన్నారు.