సూర్యాపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ను పెంచి
పోషించినోళ్లు,సూర్యపేట పట్టణ ప్రజలకు పాయాఖానా నీళ్లు తపించునోళ్ళకు
అభివృద్ధి అంటే సుతారం గిట్టనట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర విద్యుత్
శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రవతరణ దినోత్సవ
దశాబ్ది ఉత్సావాలపై ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నేతలతో పాటు పొరుగు
జిల్లాకు చెందిన నాయకుడు మాట్లాడిన మాటలు ముమ్మాటికి అభివృద్ధి ని ఇష్ట పడకనే
అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవతరణ దినోత్సవ దశాబ్దిఉత్సవాలలో బాగంగా మంగళవారం
సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన విద్యాదినోత్సవం వేడుకల్లో ఆయన
ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి
మాట్లాడుతూ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏక కాలంలో భాగస్వామ్యం అయి
దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ప్రపంచంలోనే అరుదైన సందర్భంగా ఆయన
వర్ణించారు. అటువంటి సందర్భాన్ని అపహాస్యం చేసేలా పెదాలు విరువడం అంటే
ముమ్మాటికి ప్రజలను అవమాన పరచడమే నన్నారు.
ఫ్లోరోసిస్ మహమ్మారితో జీవచ్చంలా మారిన మునుగోడు, దేవరకొండ ప్రజలకు సురక్షిత
మంచి నీరు అందించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విదంగా ఒక ప్రాంతంలో విసర్జించబడి డ్రైనేజీల గుండా
మూసికి చేరి మరో ప్రాంతానికి మంచినీళ్లు అయిన సందర్భం ఏదైనా ఉంది అంటే అది
సూర్యాపేట పట్టణమే నన్నారు. అటువంటి మూసి మురికి నీటి బారి నుండి ఇక్కడి
ప్రజలకు విముక్తి కలుగ చేయడం వారికి ఇష్టం లేకనే అవాకులు, చెవాకులు
పెళుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. జలసాదన ఉద్యమ నేత దుశ్చర్ల సత్యనారాయణ మాటలను
ఆయన ఉటంకిస్తూ హైదరాబాద్ పాయాఖానా నీళ్లు సూర్యపేట పట్టణ ప్రజలకు త్రాగునీటి
గా సరఫరా చేసిన పాపం 2014 వరకు ఏలిన పాలకులది కాదా అని ఆయన నిలదీశారు. అటువంటి
దుస్థితి నుండి బయట పడేసి సురక్షితమైన త్రాగు నీరు అందిస్తున్నందుకా వారి
పెదాల విరుపు అంటూ ఆయన విరుచుకుపడ్డారు.
2014 కు పూర్వం సబ్ స్టేషన్లు, విద్యుత్ సిబ్బంది అంటే దాడులు,ధర్నాలు,
బందించడం ఎపిసోడ్ లు ఉండేవని 2014 తరువాత అందుకు భిన్నంగా ఆ అధికారుల అహ్హనం
మేరకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా విజయోత్సవాలు జరుపుకుంటుంటే పెదాలు
విరిసినోళ్లకు కంటగింపుగా ఉన్నందునే ఆ మాటలు మాట్లాడుతున్నారన్నారు.బీళ్లుగా
మారిన పంటపొలాలు సస్యశ్యామలం అయి వరి దిగుబడిలో రికార్డ్ సృష్టిస్తుంటే ఆ
ఆనందాన్ని పంచుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నూతనంగా నిర్మించిన
ఆధునిక దేవాలయాలుగా రూపాంతరం చెందిన రైతు వేదికల వద్ద జరుపుకుంటున్న సంబురాలపై
విమర్శలు గురిపించడం అంటే రైతాంగాన్ని విమర్శించడమే నన్నారు.అంకెల గారడి
చెయ్యడం లేదు. జరిగింది అంకెలతో సహా వెల్లడిస్తున్నాం. అభివృద్ధి ని
ఆస్వాదిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఎందుకు
వచ్చిందో పెదాలు విరిసినోళ్లే జవాబు చెప్పాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి సూటిగా
ప్రశ్నించారు.