విజయవాడ : అభివృద్ధిలో సీఎం జగన్ కు మరెవరూ సాటిరారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 23 వ డివిజన్లో రూ. 95.90 లక్షల వ్యయంతో నిర్మించిన గోవిందరాజులనాయుడు వీధి, విష్ణువర్థన్ రావు వీధి, నరసింహనాయుడు వీధులలో నూతనంగా నిర్మించిన సీసీ రహదారులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ ఇంఛార్జి ఆత్మకూరు సుబ్బారావులతో కలిసి ఆయన ప్రారంభించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసగించిందని మల్లాది విష్ణు ఆరోపించారు. వందలాది కుటుంబాలు నివసించే కాలనీలపైనా కనీసం దృష్టి సారించలేకపోయారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టి నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్లు, డ్రెయిన్లు, త్రాగునీరు ఇలా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ.. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ. 76.10 లక్షల వ్యయంతో గోవిందరాజులనాయుడు వీధి, విష్ణువర్థన్ రావు వీధులలో సీసీ రోడ్లు., రూ. 19.80 లక్షల వ్యయంతో నరసింహనాయుడు వీధిలో సీసీ రహదారిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 1,100 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. గత మూడున్నరేళ్ల కాలంలో డివిజన్లో రూ. 3.25 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు మల్లాది విష్ణు తెలిపారు. వీటిలో రూ. 1.25 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 1.36 కోట్ల పనులు వివిధ దశలలో ఉన్నట్లు తెలిపారు. మరో రూ. 63 లక్షల పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలియజేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులలో అట్టా రత్తయ్య వీధి, శివాలయం వీధులలో రహదారులను పూర్తి చేసుకున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు.