గోపాలనగరం నుంచి ఊటకొండ వరకూ 1.5 కోట్లతో నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం
తీరిక లేకున్నా బాధ్యత మరువని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల : ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన సొంత నియోజకవర్గంలో
అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా
ముందుకు సాగుతున్నారు. ప్యాపిలీ మండలంలోని జలదుర్గంలో రూ.2 కోట్లతో జలదుర్గం
నుంచి డోన్ వెళ్లే రహదారికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా శనివారం
శంకుస్థాపన జరిగింది. 1.5 కి.మీ మేర రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే
రోడ్డు పనులకు సంబంధించి మంత్రి బుగ్గన శంకుస్థాపన చేశారు. జలదుర్గం మండల
ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్థానిక ప్రజల గ్రీవెన్స్ ను మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ స్వీకరించారు. అక్కడక్కడ తాగునీటికి సంబంధించి ప్రజల వినతులపై
మంత్రి బుగ్గన స్పందించారు. డోన్ నియోజకవర్గానికి శాశ్వతంగా తాగునీటి సమస్య
లేకుండా చేయడానికే రూ.300 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుని యుద్ధప్రాతిపదికన
మొదటి ఫేజ్ పనులు సాగుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. తొలుత బేతంచెర్ల
వాసులకు, తర్వాత దశలవారీగా డోన్, ప్యాపిలీ మండలాలకు కూడా వాట్ గ్రిడ్ ద్వారా
ఇంటింటికి త్రాగు నీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. భూమికి సంబంధించిన
పలు సమస్యలపై స్థానిక ప్రజల వినతుల మేరకు తహసీల్దార్ కు తగు ఆదేశాలిచ్చారు.
అనంతరం స్థానిక మస్జీదుకు సంబంధించిన మౌలికసదుపాయాల కల్పనపై ముస్లింలు మంత్రి
దృష్టికి తీసుకువచ్చిన అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్యాపిలీ
మండలంలోని గోపాల నగరం నుంచి ఊటకొండ మధ్య నిర్మించిన కొత్త రహదారిని మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.రూ.1.5 కోట్లతో 3.2
కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రోడ్డుపై డప్పు వాయిద్యాల నడుమ మంత్రి
బుగ్గన..స్థానిక ప్రజలతో పాదయాత్రగా తరలి వెళ్లారు. ఎండను లెక్కచేయకుండా
ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు, వృద్ధులతో, రహదారి పొడవునా పొలంలోని కూలీలను
పలకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. అర్హులైన పేదలందరికీ ప్రజలు కోరుతున్న
సమస్యాత్మక దేవాదాయ శాఖ పరిధిలోని భూములకు బదులు మరో చోట భూములను కొనుగోలు
చేసి ఇళ్ల పట్టాలిస్తామని మంత్రి పేర్కొన్నారు. డోన్ నుంచి రాయలచెరువు వెళ్లే
రహదారి వినతి పట్ల మంత్రి సానుకూలంగా స్పందించారు. డోన్ వ్యాప్తంగా 68 చెరువుల
అభివృద్ధి కోసం రూ.300 కోట్లు వెచ్చించుతున్నట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు.
గోరుకల్లు నుంచి మొత్తం నియోజకవర్గానికి ఇంటింటికి తాగునీరివ్వడానికే వాటర్
గ్రిడ్ ప్రాజెక్టును రూ.330 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. నీటిని శుద్ధి
చేసి, సరఫరా చేసేందుకోసం నిల్వ ఉంచే ట్యాంకర్ నిర్మాణాన్ని 8 ఎకరాలలో కడుతున్న
విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రూ.2.30 కోట్లతో ఊట కొండ చెరువును అభివృద్ధి
చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇంత వరకూ 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో రహదారి
లేని చోట్ల కూడా డోన్ లో కొత్త రోడ్లు అందుబాటులోకి వచ్చాయని, బుగ్గానిపల్లె
గ్రామాన్ని అందుకు ఉదాహరణగా మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర
మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, ప్యాపిలీ వ్యవసాయ సలహాదారు మెట్టు
వెంకటేశ్వరరెడ్డి, ఆర్డీవో వెంకట రెడ్డి,మాజీ జెడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి,
ప్యాపిలీ ఎంపీడీవో ఫజుల్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
తీరిక లేకున్నా బాధ్యత మరువని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ : ఆర్థిక
శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆర్థిక మంత్రిగా
ఢిల్లీ పర్యటనలతో తీరికలేకుండా గడిపే నేపథ్యంలో ఏ మాత్రం అవకాశం చిక్కిన
కార్యకర్తలు, స్థానిక ప్రజల కార్యక్రమాలకు హాజరవుతూ అందరినీ
ఆశ్చర్యపరుస్తుంటారు. శనివారం ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో మాజీ
ఎంపీటీసీ బోయ శ్రీనివాసులు ఇంటికి వెళ్లి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వయంగా
పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలికి శస్త్రచికిత్స జరిగిన సమాచారం
తెలుసుకుని మంత్రి వెళ్లి పలకరించడంతో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా స్వాగతం
పలికారు. తీరికలేని కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే ఆర్థిక మంత్రి
ఆకస్మికంగా తమ ఊరికి, వీధికి రావడంతో జలదుర్గం వాసులు హర్షం వ్యక్తం చేశారు.
పరామర్శ అనంతరం తిరిగి వస్తున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ని ఓ వృద్ధురాలు
ఆప్యాయంగా పలకరించారు. “బాగుండాలయ్యా!” అంటూ చేతులెత్తి ఆశీర్వదించారు.
అనంతరం ప్యాపిలి మండలం చండ్రపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లకు
వెళ్లి పలకరించి స్థానికులను ఆశ్చర్యపరిచారు. దేవమణి అనే కార్యకర్త కుటుంబంలో
ఇటీవల జరిగిన వివాహ వేడుకకు ఢిల్లీ పర్యటన కారణంగా హాజరు కాలేకపోయిన నేపథ్యంతో
వారి కుమార్తె, అల్లుడిని నేరుగా ఇంటికి వెళ్లి మంత్రి బుగ్గన ఆశీర్వదించారు.
అనంతరం అదే గ్రామంలో మహేశ్వరరెడ్డి, పొంగూరు తిరుమల రెడ్డి ఇళ్లకు వెళ్లి వారి
కుటుంబ సభ్యులను కలిసి కాసేపు ముచ్చటించారు. చివరగా కొండయ్య అనే వైసీపీ
కార్యకర్త ఇంటికీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన వెళ్లి వారి కుటుంబ సభ్యులను
పలకరించి, కొండయ్య కుమార్తె దంపతులను అక్షింతలతో ఆశీర్వదించారు. మంత్రి రాకతో
కార్యకర్తల కుటుంబాలు సంతోషంగా గడిపారు. తాము పిలిచిన సమయంలో మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ తీరికలేకున్నా మా కోసం స్వయంగా వచ్చారంటూ ఆనందంలో మునిగిపోయారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, ప్యాపిలీ
వ్యవసాయ సలహాదారు మెట్టు వెంకటేశ్వరరెడ్డి, ఆర్డీవో వెంకటరెడ్డి పాల్గొన్నారు.