విజయవాడ : వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే
ముందంజలో ఉందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది
విష్ణు తెలిపారు. శనివారం 63 వ డివిజన్ 278 వ వార్డు సచివాలయ పరిధిలో
నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు
శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన
పాల్గొన్నారు. పాత రాజీవ్ నగర్లో విస్తృతంగా పర్యటించి 320 గడపలను
సందర్శించారు. ప్రతి ఇంటికి వెళ్లి మూడున్నరేళ్ల వైఎస్ జగన్ ప్రభుత్వ
పాలనలో చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సంతకం చేసిన సంక్షేమ బుక్ లెట్లను అందజేశారు.
మహానేత వైఎస్సార్ తొలి ఐదు సంతకాలను చూసి కాపీ కొట్టిన చంద్రబాబు ఐదేళ్ల
కాలంలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయారని మల్లాది విష్ణు
విమర్శించారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల
కాలంలోనే 99 శాతం హామీలను నెరవేర్చారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా స్థానిక
సమస్యలపై ఆరా తీసిన ఆయన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు
సూచించారు. అలాగే అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు.
ప్రజాధనాన్ని లూటీ చేసిన జన్మభూమి కమిటీలు
చంద్రబాబు గత ఐదేళ్ల ప్రభుత్వంలో ప్రజాధనమంతా తెలుగుదేశం పార్టీ నేతలు,
జన్మభూమి కమిటీల జేబుల్లోకి వెళ్లిపోయాయని మల్లాది విష్ణు విమర్శించారు.
టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా చేశారని, జన్మభూమి
కమిటీల పేరుతో లూటీ చేశారని గుర్తుచేశారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో కుల,
మత, వర్గ, పార్టీ బేధాలు లేకుండా అర్హతే ప్రామాణికంగా పేదలకు సంక్షేమ పథకాలు
అందిస్తుండటం గర్వంగా ఉందని తెలిపారు.
సత్యకుమార్ చెప్పేవన్నీ అసత్యాలే
బీజేపీ నేత సత్యకుమార్ చెప్పేవన్నీ అసత్యాలేనని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్
మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యమంత్రి పై బీజేపీ నేతలు చేస్తున్న
దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్ణయం పూర్తిగా
రాష్ట్రానిదేనని కేంద్రం ఎప్పుడో చెప్పిందని గుర్తుచేశారు. సుప్రీంలో
నడుస్తున్న కేసులో కేంద్రం ఏదైతే అఫడవిట్ వేసిందో అదే అప్పట్లో ఏపీ
హైకోర్టులోనూ వేసిందన్నారు. సీఆర్డీఏ యాక్టును రాష్ట్ర ప్రభుత్వం చేసేటప్పుడు
కేంద్రాన్ని సంప్రదించలేదని ఆ అఫడవిట్లో కేంద్రం స్పష్టంగా పేర్కొందన్నారు.
సంబంధిత వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది. కేంద్రానికి ఏ
మాత్రం సంబంధం లేనిదని చెప్పారన్నారు. కానీ సత్యకుమార్ లాంటి వారు అందుకు
భిన్నంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళపరుస్తున్నారని మల్లాది విష్ణు అన్నారు.
ఇప్పటికైనా ద్వంద్వ వైఖరి విడనాడి అమరావతిపై తమ స్టాండ్ ను స్పష్టంగా
తెలియజేయాలని డిమాండ్ చేశారు.