భవిష్యత్తులో ప్రభుత్వరంగ సంస్థగా అగ్రస్థానంలో నిలబెట్టాలి
ఎపిఎండిసి కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
జెండా ఆవిష్కరించిన సంస్థ విసి&ఎండి వి.జి వెంకటరెడ్డి
స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎపిఎండిసి) ప్రధాన కార్యాలయంలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని కార్యాలయం ప్రాంగణంలో సంస్థ విసి అండ్ ఎండి విజి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దేశంగా రాజ్యాంగ విలువలతో స్వాపరిపాలనలో మనం సాధిస్తున్న ప్రగతి ప్రపంచదేశాల్లోనే మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతోందని అన్నారు. మహనీయుల త్యాగాల ఫలితంగా మనం సాధించుకున్న స్వేచ్చా, రాజ్యాంగబద్దమైన పాలన భారతదేశంను అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంచేందుకు దోహద పడుతోందని అన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో ప్రభుత్వరంగ సంస్థగా ఎపిఎండిసిని అభివృద్ధి పథంలో నడిపించుకుంటున్నాం. 2020-21లో మన రెవెన్యూ రూ.434 కోట్లు కాగా, 2021-22లో దానిని రెట్టింపు అంటే 900 కోట్లకు పెంచుకున్నాం. అలాగే 2022-23లో గత ఏడాది రెవెన్యూను రెట్టింపు చేస్తూ రూ.1800 కోట్లు సాధించాం. ఇక ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో దాదాపు రూ.4వేల కోట్ల రెవెన్యూను సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇదంతా మనందరి సహకారం, పట్టుదల, కృషితోనే సాధ్యపడింది. సింగరేణి, కోల్ ఇండియా వంటి ప్రముఖ ప్రభుత్వరంగ బొగ్గు సంస్థల సంస్థల సరసన ఎపిఎండిసి నిలబడింది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మైనింగ్ రంగంలోకి ఎపిఎండిసి అడుగుపెట్టడమే కాదు, రెవెన్యూ ఆర్జనలోనూ తన సత్తా చాటుకుంటోంది. త్వరలోనే బ్రహ్మదియా కోకింగ్ కోల్ లో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అలాగే రెండు బీచ్ శాండ్ మైనింగ్ ప్రాజెక్ట్ లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. బెరైటీస్ లో ప్రపంచస్థాయి మార్కెట్ ను సుస్థితరం చేసుకున్నాం. గ్రానైట్, కాల్సైట్ బాల్ క్లే ఐరన్ ఓర్ రంగాల్లోనూ ఎపిఎండిసి పురోగతికి బాటలు వేస్తోంది. మైనింగ్ రంగంలో మన ప్రగతి ఈ రాష్ట్ర జిడిపిలో 2.5 శాతంగా ఉంది. దేశ జిడిపిలో మైనింగ్ రంగ వాటా కేవలం 1.5 శాతం మాత్రమే. ఇటు పరిశ్రమల అవసరాలకు ఖనిజాలను అందిస్తున్నాం. అటు రాష్ట్రానికి రెవెన్యూను సమకూరుస్తున్నాం. అంతేకాకుండా యువతకు ఉపాధి మార్గాలను మెరుగుపరుస్తున్నాం. భవిష్యత్తులో ఎపిఎండిసిని మరింత ముందుకు తీసుకు వెళ్ళేందుకు అందరి సహకారంను, కృషిని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో సంస్థ సలహాదారులు డిఎల్ఆర్ ప్రసాద్, కె.నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్లు బిపిన్ కుమార్, రామన్ నారాయణన్, జనరల్ మేనేజర్ టి.నతానేయల్, డిజిఎం ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.