విజయవాడ : అరబిక్, యూరోపియన్, పాశ్చాత్య దేశాలతో సమానంగా వ్యాపార రంగంలో భారత
దేశం అగ్రగామిగా నిలిచి అభివృద్ధి వైపు స్థిరంగా ముందుకు సాగడం శుభ పరిణామమని,
అభివృద్ధి చెందిన దేశాలకు భారత దేశం గమ్య స్థానంగా నిలుస్తోందని రాష్ట్ర
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. గ్లోబల్ ఇండియా బిసినెస్ ఫోరమ్
ఆధ్వర్యంలో స్థానిక నోవోటెల్ హోటల్లో శనివారం నిర్వహించిన నేషనల్ బిజినెస్
ఎక్సిలెన్స్ 2023, అవార్డుల ప్రధానం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వ
భూషణ్ హరిచందన్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని
ప్రారంభించారు. పలువురు ఉత్తమ పారిశ్రామిక వేత్తలకు అవార్డులు అందజేసిన అనంతరం
గవర్నర్ మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, స్వావలంబనగా
మార్చేందుకు భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు.
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి
అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాకారం చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్న,
మధ్యతరహా పరిశ్రమలు, వారికి మద్దతుగా వివిధ పథకాలు, ప్రోత్సాహకాల అమలు
చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ
అమలుతో భారతీయ వస్తువులను త్వరగా ఎగుమతి చేయడం ద్వారా భారతీయ వ్యాపార
రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్
వరి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిందని అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం
కావడంతో ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ అని పేరొచ్చిందన్నారు. దేశంలో హస్తకళలకు
మన రాష్ట్రం పేరు ప్రఖ్యాతలు సాధించిందని రాష్ట్రం శ్రీకాకుళంలోని బుడితి
నుండి ప్రత్యేకమైన మెటల్ సామాను, ఇత్తడి, రాయి మరియు చెక్క చెక్కడం, బొబ్బిలి
ఏటికొప్పాక నుండి రంగురంగుల మరియు కొండపల్లి నుండి బొమ్మలు, జానపద పెయింటింగ్,
కలంకారి పెయింటింగ్, బ్లాక్ ప్రింటెడ్ బట్టలు, చేనేత పట్టు చీరలు మొదలైన
వాటికి ప్రసిద్ధి చెందటామె కాకుండా టేకు మరియు యూకలిప్టస్ వంటి అధిక-నాణ్యత
కలపను ఉత్పత్తిచేస్తుందన్నారు. మన రాష్ట్రం ముడి పట్టు జూట్ ఉత్పత్తిలో
రెండవ స్థానంలో ఉందన్నారు. 2020-21 సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం, రాష్ట్రం ప్రభుత్వం
వ్యాపార రంగానికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందనే దానికి
నిదర్శనమన్నారు. వ్యాపార రంగానికి దేశంలోనే మన రాష్ట్రం ఎంతో అనుకూలమైందని
ఆరు ఓడ రేవులు ఆరు విమానాశ్రయాలు, లక్ష 23 వేల కిలోమీటర్ల రోడ్ నెట్ వర్క్
2600 కిలోమీటర్ల రైల్ నెట్ వర్క్ కలిగి నిరంతరం విద్యుత్ సరఫరా
అందిస్తోందన్నారు. అంధ ప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా
ఉన్నాయన్నారు.