అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు
చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.. నాకెవరూ లేరు
దత్తపుత్రుడు, వదిన, మీడియా అధిపతులు చంద్రబాబు క్యాంపెయినర్లు అన్న జగన్
రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన అభిమానులు కూడా స్టార్ క్యాంపెయినర్లే
ప్రతి ఇంట్లోని అక్కాచెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
అనంతపురం జిల్లా ఉరవకొండ : టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడూ ఒక్క మంచి పని కూడా చేయలేదని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చంద్రబాబుకు గజదొంగల ముఠా ఉందని అన్నారు. రామోజీరావు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లకు తోడు దత్త పుత్రుడు ఉన్నారని ఎద్దేవా చేశారు. వీళ్లకు మనం ప్రతిరోజూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరుగుతున్నా మీడియా మొత్తం తన వైపే ఉండటంతో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరానిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏ సంక్షేమం చేయకపోయినా, ఆయనను ఆకాశానికి ఎత్తేసేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని జగన్ అన్నారు. పక్క పార్టీల్లో, పక్క రాష్ట్రంలో ఆయనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పారు. దత్తపుత్రుడు (పవన్) ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, ఆయన వదిన (పురందేశ్వరి) మరో స్టార్ క్యాంపెయినర్ అని విమర్శించారు. పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉండే మీడియా అధిపతులు చంద్రబాబుకు క్యాంపెయిన్ చేస్తుంటారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన చంద్రబాబు అభిమాని కూడా ఆయన స్టార్ క్యాంపెయినరే అని అన్నారు. పసుపు, కమలాల మనుషులతో పాటు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఆయనకు ఉన్నారని చెప్పారు. వీరిలో కొందరు వేదికలపై కనిపిస్తే, మరికొందరు టీవీల్లో కనిపిస్తారని చెప్పారు. బాబును భుజాన మోసే ముఠాలో చాలా మంది ఉన్నారని అన్నారు. తనకు ఒక్క స్టార్ క్యాంపెయినర్ కూడా లేరని, మన ప్రభుత్వంలో మంచి జరిగిన ప్రతి ఇంటిలోని అక్కాచెల్లెమ్మలే తన స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు : టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ మంచి ఎందుకు జరగలేదని అందరూ ఆలోచించాలని సూచించారు. గతంలో దోచుకో, పంచుకో అన్నట్టుగా ఉండేదని, ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే, నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోందని, ఈ తేడాను గమనించాలని కోరారు. పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత ఆ మాటను గాలికొదిలేశారని జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పొదుపు సంఘాలకు నష్టం జరిగిందని అన్నారు. ఇప్పుడు అవే పొదుపు సంఘాలు మంచి శాతంతో గ్రేడులు సాధించి గర్వంగా నిలబడ్డాయని చెప్పారు. కుట్రలు, కుతంత్రాల జెండాలు కట్టడమే చంద్రబాబు అండ్ కో అజెండా అని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ అజెండా అని అన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని చెప్పారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.