శ్రీహరికోట : స్థానిక సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ
వేదిక నుంచి ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 2.35 గంటలకు నిర్వహించనున్న
చంద్రయాన్–3 ప్రయోగానికి సంబంధించి ఎల్వీఎం3–ఎం4 రాకెట్‌కు ఎలక్ట్రికల్
పరీక్షలను పూర్తిచేశారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఇస్రో అత్యంత
ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అదేవిధంగా ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో
ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని
ఈ ప్రయోగానికి సంబంధించిన అన్ని అంశాలను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా
పరిశీలిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు రోజూ అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత
ప్రయోగాన్ని నిర్వహిస్తారు.
చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
ఈ నెల 14న చంద్రయాన్–3 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆసక్తిగలవారు ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలని షార్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు
శుక్రవారం నుంచే lvg. shar.gov.in అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి
పేరు, పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని, ఆధార్ కార్డు, కోవిడ్ పరీక్ష
సర్టిఫికెట్ కూడా ఉండాలని పేర్కొన్నారు.