నెల రోజుల్లో సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్ : రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగ ఫలితమే నూతన
సచివాలయమని, తెలంగాణ ఆత్మగౌరవానికి అది ప్రతీకగా, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా
నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీఆర్ అంబేడ్కర్ పేరుతో దాని
గౌరవం మరింత ఇనుమడించిందన్నారు. రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను సీఎం
గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు
అవసరాలను దృష్టిలో ఉంచుకునే సచివాలయ నిర్మాణం జరుగుతోంది. పేదలు, బడుగు బలహీన
వర్గాల సంక్షేమమే లక్ష్యంగా.. అంబేడ్కర్ పేరును సార్థకం చేసే విధంగా సచివాలయ
నిర్మాణం జరుగుతోంది. దేశంలో పూర్తిగా దోల్పుర్స్టోన్ను వాడిన కట్టడం
ఇదొక్కటే. తెలంగాణ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సచివాలయానికి
ఎదురుగా అమరవీరుల స్తూపం నిర్మాణమవుతోంది. సచివాలయం పక్కనే రూపుదిద్దుకుంటున్న
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎప్పటికప్పుడు తమ
కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
గంటసేపు పరిశీలన
దాదాపు గంట సేపు సీఎం సచివాలయాన్ని పరిశీలించారు. నెల రోజుల్లో పూర్తి చేయాలని
ఆదేశించారు. దాని నిర్మాణ కౌశలాన్ని, ఉద్దేశాన్ని తనవెంట వచ్చిన
ప్రజాప్రతినిధులకు వివరిస్తూ ముందుకు సాగారు. సచివాలయం ప్రధాన ద్వారం దగ్గర
నుంచి పై అంతస్తు వరకు పరిశీలించారు. ప్రధాన ద్వారం ఎలివేషన్, డోములు, వాటర్
ఫౌంటెయిన్లు, పచ్చికబయళ్లు, మెట్లను చూశారు. మంత్రుల ఛాంబర్లను, సిబ్బంది
కార్యాలయాలు, క్యాంటీన్లను, సమావేశ మందిరాలను పరిశీలించి కొన్ని సూచనలు
చేశారు. వాహనాల రాకపోకలకు అనుగుణంగా తాను సూచించిన విధంగా నిర్మాణాలు
జరుగుతున్నాయని తెలిపారు. హెలిప్యాడ్ కోసం స్థలాన్ని పరిశీలించిన వెంటనే
నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయాలు, సీసీ
కెమెరాలు, స్ట్రాంగ్‌రూంల నిర్మాణాలను, జాతీయ అంతర్జాతీయ అతిథుల కోసం
నిర్మించిన సమావేశ మందిరాలను పరిశీలించారు.
పార్లమెంట్ తరహాలో నిర్మిస్తున్న టెర్రాకోట వాల్ క్లాడింగ్‌ను చూశారు.
సచివాలయానికి బయల్దేరడానికి ముందు రోడ్లు, భవనాల అధికారులు ప్రగతిభవన్‌లో
ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా పలు అంశాలను కేసీఆర్‌కు
వివరించారు. ముఖ్యమంత్రి వెంట హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్,
జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజీవ్‌శర్మ,
సీఎస్ సోమేశ్‌కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.