బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు అయిన
“తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవం” సందర్భంగా బాన్సువాడ పట్టణం పరిధిలోని
కొయ్యగుట్ట వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించిన
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. పాల్గొన్న డీసీసీబీ
చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షులు డి అంజిరెడ్డి,
మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు,
ప్రజలు, విద్యార్థులు. తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన శ్యామకూర శంకర్ (సోమేశ్వరం
గ్రామం), హరిబాబు (కొత్తాబాది గ్రామం) ల కుటుంబ సభ్యులను గౌరవప్రదంగా
సన్మానించిన సభాపతి పోచారం. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ అమరుల
త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్ర ప్రగతి. ఎంతోమంది పోరాటం, బలిదానాలతో
వచ్చిన తెలంగాణ ను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం
ఆషామాషీగా రాలేదు.
దశాబ్దాల పోరాటం, వందలాది మంది యువత బలిదానాలతో ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం.
ఇవన్నీ చారిత్రక సంఘటనలు. 1969 లో జరిగిన తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నేను
లాఠీ దెబ్బలు తిన్నాను. అప్పుడు ఆంధ్రా పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని
అణిచివేయడానికి కఠినంగా వ్యవహారించారు. ఆంధ్రా ప్రాంతం నుండి పోలీసులను
రప్పించారు. ఆనాటి కాల్పులలో 369 మంది యువకులు చనిపోయారు. నేను అప్పుడు
హైదరాబాద్ లోని మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న నాగార్జున ఇంజనీరింగ్ కాలేజీలో
ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. మేము మొత్తం ఏడుగురం విద్యార్థులం
ఆందోళన చేస్తుంటే పోలీసు కాల్పులు జరిగి నా పక్కన ఉన్న నా సహ విద్యార్థి
చనిపోయారు. మా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో వేసి ,
బట్టలు విప్పి ఎనిమిది రోజులు కొట్టారు. అంతా ఆంధ్రా పోలీసులు. పాచిపోయిన
తిండి పెట్టేవాళ్ళు. బూతులు తిడుతూ, కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా వాచిపోయింది.
ఇంకా కొడితే చచ్చిపోతామని ఎనిమిది రోజులకు నడవలేని పరిస్థితిలో ఉన్న మమ్మల్ని
రోడ్డు మీదకు తోసారు. ఒళ్ళంతా నొప్పులతో, కడుపులో ఆకలితో దిక్కుతోచక తెలిసిన
వారి సహాయంతో ఊరికి చేరుకున్నాం. ఆనాటి ఆంధ్రా పాలకులు అంత కఠినంగా
వ్యవహారించారు. అయినా ఉద్యమం కొనసాగింది. ఉద్యమానికి మద్దతుగా ఇంజనీరింగ్
చదువు మద్యలోనే వదిలేసి ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకున్నాను. నాడు ఉద్యమం
ఉదృతంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో మర్రి చెన్నారెడ్డి నాటి ప్రధానమంత్రి
ఇందిరాగాంధీ కి లొంగిపోయి, లాలూచి పడి ఉద్యమాన్ని వదిలేసాడు. తెలంగాణ ప్రజా
సమితి నుండి గెలిచిన 11 మంది ఎంపీలు కూడా పార్టీ మారారు. అంతటితో తెలంగాణ తొలి
ఉద్యమం ఆగిపోయింది. తిరిగి 2001లో కేసీఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమం మొదలైంది.
బషీర్ బాగ్ లో జరిగిన కాల్పులలో 6 రైతులు చనిపోయిన తరువాత కేసీఆర్ గారు
తెలంగాణ ఉద్యమం వైపు మరలారు. నేడు అమరవీరుల స్థూపం నిర్మిస్తున్న ప్రదేశంలో
ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం లో కొంతమంది పెద్దలతో సమావేశం జరిపిన
కేసీఆర్ గారు మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమంలో భాగంగా 2009
లో
అమరణ నిరాహారదీక్ష
చేస్తున్న కేసీఆర్ చనిపోతాడని సమాచారం ఢిల్లీకి చేరింది. ఆ భయంతో తెలంగాణ
ఇస్తామని సోనియా గాంధీ ప్రకటించారు. మళ్ళీ మాట వెనక్కి తీసుకున్నారు.
ఈసందర్భంలోనే విద్యార్థులు నిరాశతో ఆత్మ బలిదానాలు చేసుకోవడం మొదలైంది.
తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. తెలుగుదేశం
పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నాను. ఎవరు వచ్చినా రాకున్నా నేను తెలంగాణ
రాష్ట్రానికి మద్దతుగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాను. కేసీఆర్ నాయకత్వంలో
తప్ప ఇంకో విదంగా తెలంగాణ రాష్ట్రం సాదించలేం అని 2011 లో తెలుగుదేశం పార్టీ
సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశాను. మీ అందరి మద్దతు,
ఆశీర్వాదంతో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి యాబై వేల మెజారిటీతో
గెలిచాను. అమరవీరుల కుటుంబం లోని సభ్యుడికి ఉద్యోగం, 10 లక్షల రూపాయల ఆర్థిక
సహాయం అందించారు. అమరవీరుల త్యాగాలు అందరికీ తెలియజేసే విదంగా హైదరాబాద్ లో
రూ. 150 కోట్లతో అమరవీరుల స్థూపం నిర్మించారు. ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
హైదరాబాద్ వచ్చే దేశ, విదేశాలకు చెందిన వారు అమరవీరుల స్థూపాన్ని సందర్శించి
వారి త్యాగాల గురించి తెలుసుకునే విదంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమైక్య
రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేశారు. ప్రభుత్వ
పథకాలలో కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారు. ఒక్క బాన్సువాడ మండలం లోనే
2,728 ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించామని దోచుకుతిన్నారు. నిర్మించామని కాగితాల మీద
రాసుకున్న ఇందిరమ్మ ఇళ్ళు ఎక్కడ ?. తెలంగాణ రాష్ట్రంలో మేము కడుతున్న డబుల్
బెడ్ రూం ఇళ్ళు ఈరోజు అందరికీ అగుపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో తెలంగాణ
అద్భుతమైన ప్రగతి సాదించింది. ధాన్యం ఉత్పత్తి 36 లక్షల టన్నుల నుండి 3 కోట్ల
టన్నులకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే ఈ అభివృద్ధి
సాద్యపడింది. అమరుల త్యాగాలను స్మరించుకుని, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో
నెంబర్ వన్ గా ఉంచాలి. తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అప్పుడే అమరుల ఆత్మ
శాంతిస్తుందన్నారు.