అమెరికాలో శుక్రవారం సంభవించిన మంచుతుపాన్(బాంబ్ సైక్లోన్) 200 మిలియన్ల మందిపై ప్రభావం చూపింది. భారీ మంచు, ఈదురుగాలుల రొద, వేడి నీళ్లు కూడా గడ్డ కడుతున్నంత చలి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. న్యూయార్క్ నగరంలో మంచు తుపాన్ కారణంగా ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీల సెల్షియస్ కు పడిపోవడంతో ఎముకలు కొరికే చలితో అమెరికన్లు వణుకుతున్నారు. తుపాను కారణంగా అమెరికా దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.యునైటెడ్ స్టేట్స్లో లక్షలాది మంది ప్రజలు మంచు తుపాను బారిన పడ్డారు. సెలవు రోజుల్లో అమెరికన్లు వారి ఇళ్లలో చిక్కుకుపోయారు. మంచు తుపాన్ కారణంగా 1.4 మిలియన్ల గృహాలు దెబ్బతిన్నాయి. ఈదురు గాలులతో చెట్లు,విద్యుత్ లైన్లు పడిపోయాయి. దీని వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది. మంచుతుపాన్ వల్ల 3వేల విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.తుపాన్ ప్రభావం వల్ల 23 మంది మరణించారు. ఓహియోలో కారు ప్రమాదాల్లో మరో నలుగురు మరణించారు. ప్రజలు ఇళ్లలోనే అప్రమత్తంగా ఉండాలని ఓహియో గవర్నర్ కోరారు.తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భరించలేనంతగా మారడంతో న్యూయార్క్ గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అమెరికాలోని ఓక్లహోమా, కెంటకీ, మిస్సౌరీ, టేనస్సీ, విస్కాన్సిన్, కాన్సాస్, నెబ్రాస్కా, ఒహియో, న్యూయార్క్, కొలరాడో, మిచిగాన్ రాష్ట్రాల్లో మరణాలు నమోదయ్యాయని జిన్హువా న్యూస్ ఏజెన్సీ నివేదించింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మంచు తుఫాను కారణంగా యుఎస్‌లోని అంతర్గత సహా 3,300 విమానాలు శనివారం రద్దు చేయబడ్డాయి.
ఆదివారం నాటికి పశ్చిమ న్యూయార్క్‌లో విద్యుత్‌ను పునరుద్ధరించగలిగామని రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ తెలిపారు. మంచు తుఫాను ఇంకా ముగియలేదని ఆయన ట్వీట్ చేశారు. ప్రజలు నివాసాల్లోనే ఉండాలని, ప్రయాణాలు చేయవద్దని సూచించారు. న్యూయార్క్‌లోని బఫాలో ప్రాంతంలో గంటకు 96 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని మీడియా తెలిపింది. విజిబిలిటీ (దృశ్యమాన్యత) సున్నాకి దగ్గరగా ఉందని పేర్కొంది. ఆదివారం నాలుగు అడుగుల నుంచి ఆరు అడుగుల మేర భారీ హిమపాతం కురవవచ్చని నేషనల్ వెదర్ సర్వే పేర్కొంది. మంచు తుఫాను, క్రిస్మస్ సెలవుల కారణంగా అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారని పేర్కొంది. శనివారం 2,700 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయని, 6,400 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని రాయిటర్స్ పేర్కొంది.