మార్పులు చేయబోతున్నారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానం బాగా తక్కువగా ఉండే విదేశీ
అభ్యర్థులకు ఇది అవరోధంగా పరిణమించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2008లో తగు
మార్పులు చేర్పులతో పౌరసత్వ పరీక్ష విధానాన్ని ఖరారు చేశారు. డోనాల్డ్
ట్రంప్ అధ్యక్షుడైన తరవాత 2020లో ఈ పరీక్షను మహా కఠినంగా మార్చి విదేశీ
అభ్యర్థులను నిరుత్సాహపరిచారు. జో బైడెన్ అధ్యక్షుడైన తరవాత పరీక్షను మళ్లీ
2008 నమూనాకు మార్చారు. అయితే, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి పౌరసత్వ పరీక్షలో
మార్పులు చేయాలని నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కొత్త పరీక్షా విధానం వచ్చే
ఏడాది నుంచి అమలులోకి వస్తుంది. నాచురలైజేషన్ పరీక్షగా వ్యవహరించే ఈ పరీక్ష
అమెరికా పౌరసత్వం పొందడానికి తొలిమెట్టు. నెలరోజుల పాటు సాగే ఈ పరీక్షలో
నెగ్గినవారు మాత్రమే పౌరసత్వం కోసం దరఖాస్తుకు అర్హులు. కొత్త విధానంలో
అభ్యర్థులు దైనందిన కార్యకలాపాలు, వాతావరణం, ఆహారానికి సంబంధించిన ఫోటోలు చూసి
ఆంగ్లంలో వాటిని వివరించాల్సి ఉంటుంది. నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చే వారు
మౌఖిక ప్రశ్నలకు తడుముకొంటూ ఎలాగోలా సమాధానం చెప్పగలిగినా ఫొటోలు చూస్తూ
జవాబులివ్వడానికి చాలా కష్టపడతారు.
అధికారులను చూడగానే అభ్యర్థులకు బెరుకు వస్తుంది. దాంతో సరైన సమాధానాలు
చెప్పడానికి బాగా ఇబ్బందిపడతారు. అమెరికా చరిత్రపై ప్రశ్నలకు గతంలో మౌఖికంగా
చిన్న చిన్న జవాబులిస్తే సరిపోయేది. కొత్త విధానంలో ప్రశ్నలకు ఐచ్ఛిక
సమాధానాలుగా ఇచ్చిన వాటిలో కచ్చితమైన జవాబును మాత్రమే చెప్పాలి. అమెరికా
చరిత్రపై ఎక్కువ పరిజ్ఞానం ఉంటేనే సరైన జవాబులివ్వగలుగుతారు. ఇది వర్ధమాన
దేశాల అభ్యర్థులకు కష్టసాధ్యం కావచ్చు. ముఖ్యంగా యుద్ధ సంక్షుభిత దేశాల నుంచి
శరణార్థులుగా వచ్చేవారు స్వదేశాలలో పాఠశాల విద్యకు నోచుకోని ఉండరు. వారు
అమెరికా చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లేదు. అలాంటి శరణార్థులకు అమెరికాలో
ఆశ్రయం దుర్లభమవుతుంది. కొత్త పరీక్షా పత్రంపై అమెరికా ప్రభుత్వం ప్రజలు,
నిపుణుల నుంచి సలహాలు సూచనలు ఆహ్వానించదలచింది. వాటిలో ఉత్తమమైన వాటిని
స్వీకరించి వచ్చే ఏడాది పరీక్షా పత్రంలో పొందుపరుస్తారు. 2022లో 10 లక్షల
మందికి పైగా అమెరికా పౌరసత్వం పొందారు.