అమెరికా : అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్‌లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు.
ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది.