కేసీఆర్ పై మండిపడ్డ బీజేపీ ఏపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
విజయవాడ : మీ స్వార్థ రాజకీయాల కోసం యువత ప్రాణాలను ఫణంగా పెట్టారు.
సెంటిమెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు?’ అంటూ బీజేపీ ఏపీ నేత
విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. గడిచిన
తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసపూరిత వాగ్ధానాలతో మబ్యపెడుతున్నదే కాక ఏపీ
ప్రజలను కూడా మోసం చేయాలని చూస్తున్నారా అని నిలదీశారు. ఈమేరకు విష్ణువర్ధన్
రెడ్డి ట్విట్టర్ వేదికగా కేసీఆర్, కేటీఆర్ లకు ప్రశ్నలు సంధించారు. విశాఖ
ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తులను కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు
చేయనుందన్న పేపర్ క్లిప్పింగ్ ను పోస్ట్ చేసి.. అమ్మకు అన్నం పెట్టనోడు
చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.
తెలంగాణ తల్లికి సింగరేణితో కలిసి బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టిస్తానని
కోతలు కోసి నాలుగేళ్లు దాటిపోయింది.. ఇప్పటికీ ఉక్కు ఫ్యాక్టరీకి బయ్యారంలో
పునాది కూడా పడలేదని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు
ఫ్యాక్టరీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫున బిడ్
దాఖలు చేశారని విమర్శించారు. విశాఖ ఉక్కు పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం
చేద్దామని చూస్తున్నారని ఆరోపించారు. మీ తండ్రీ కొడుకు (కేసీఆర్, కేటీఆర్) లకు
ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించరా? అని ఫైర్ అయ్యారు. సింగరేణిని ప్రైవేటుపరం
చేస్తున్నారంటూ మొన్న ఆందోళనలు చేసిన కేసీఆర్, ప్రస్తుతం సింగరేణితో విశాఖ
స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులను కొనేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని
విమర్శించారు. ఇలా అయితే దొరికిపోతామని మీకెవరూ చెప్పలేదా లేక ప్రజలు
పిచ్చోళ్లని మీ తండ్రీకొడుకుల నమ్మకమా? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.