చిందు యక్షగానంలో సమ్మయ్యకు సాటిలేరెవ్వరు
చిందు యక్షగానంలో పేరొందిన గడ్డం సమ్మయ్య(62) స్వస్థలం జనగామ జిల్లా దేవురుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈయన తన తండ్రి రామస్వామి నుంచే కళను పుణికి పుచ్చుకున్నారు. అయిదో తరగతి చదివిన సమ్మయ్య.. తన 12వ ఏట నుంచే రంగస్థల వేదికపై రకరకాల పాత్రలు వేస్తూ యక్షగానం కళను ప్రదర్శిస్తున్నారు. అయిదు దశాబ్దాలుగా 19 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. చిందు యక్షగానంలో పౌరాణిక కథలతో పాటు పలు సామాజిక అంశాలపై ప్రజల్లో ప్రచారం చేశారు. అక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణపై పాటలు, పద్యాలతో ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. ‘చిందు యక్ష కళాకారుల సంఘం’, ‘గడ్డం సమ్మయ్య యువ కళాక్షేత్రం’ లాంటివి స్థాపించి కళను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. సమ్మయ్య భార్య శ్రీరంజని కూడా యక్షగానం ప్రదర్శనలు ఇస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కళారత్న హంస పురస్కారంతో ఈయన్ను సత్కరించింది. తాజాగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామాయణ గాథకు సంబంధించి అయిదు ప్రదర్శనలిచ్చారు.