హిమాచల ప్రదేశ్ : ఎత్తైన పర్వత ప్రాంతాలు, అతిశీతల వాతావరణానికి ఆలవాలమైన హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ఇక్కడి ఓటర్ల తీర్పు ప్రతిసారీ విలక్షణంగా ఉంటోంది. విపక్షంలో ఉన్న ప్రధాన పార్టీకి అయిదేళ్ల తర్వాత అధికారాన్ని కట్టబెట్టడం గత మూడు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఎంత బలమైన రాజకీయ పక్షమైనప్పటికీ వరుసగా రెండో సారి అవకాశమివ్వకపోవడమనే ప్రత్యేకత రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. అధికార బీజేపీ , విపక్ష కాంగ్రెస్‌ల మధ్య తాజా అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్టీలో అంతర్గత పోరు : రాష్ట్రంలో బీజేపీకి ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ ధుమాల్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌లాంటి బలమైన నేతలున్నప్పటికీ కార్యకర్తలు, నాయకులు ఈ నేతల వర్గాలుగా విడిపోవడం తలనొప్పులు తెచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. క్షేత్ర స్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న బీజేపీ నాయకత్వం వాటిని విశ్లేషిస్తోంది. 68 స్థానాలున్న రాష్ట్రంలో బీజేపీ 25 సీట్లలో చాలా బలంగా ఉన్నట్లు, 18 స్థానాల్లో గట్టి పోటీనిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 22 స్థానాల్లో బలంగా కనిపిస్తోంది. అంతర్గత వర్గ రాజకీయాలు ముదిరితే పార్టీలకు నష్టం తప్పదు. 90 వేల నుంచి లక్ష దాక ఓటర్లుండే అసెంబ్లీ సీట్లలో అసంతృప్తులు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసి ఓట్లు చీలిస్తే ఆమేరకు పార్టీల విజయావకాశాలు దెబ్బతింటాయి. కాంగ్రెస్‌లో వర్గ పోరు మూడో వంతు సీట్లకు పరిమితం కాగా బీజేపీ లో లో అది సగం స్థానాల వరకు ఉన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే, కాంగ్రెస్‌లోనూ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్, సీఎల్పీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్సింగ్ సుఖు, మాజీ మంత్రి సుధీర్శర్మలాంటి వారు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుండటం ఆ పార్టీకి సమస్యాత్మకంగా మారింది. అయితే ఆ పార్టీకి 40 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కావడం కొంత సానుకూలమైన అంశం. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో వర్గ రాజకీయాల సమస్య సమసిపోతుందని కమలనాథులు నమ్ముతున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో ధరల పెరుగుదల అంశం కాషాయ దళానికి ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు.
హిమాచల్‌లో ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ కన్ను : అంతర్గత లుకలుకలతో సొంతంగా కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో హిమాచల్‌ప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ తపనపడుతోంది. ధరల భారం, నిరుద్యోగం వంటి సమస్యల వల్ల భాజపా సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత గూడుకట్టుకుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం వీరభద్రసింగ్‌కు రాష్ట్రంపై ఉన్న పట్టు తమను అధికార పీఠానికి చేరువ చేస్తుందని కాంగ్రెస్ విశ్వాసం. ఇటీవలి కాలంలో హస్తం పార్టీ నేతల్లో పలువురు ఇతర పార్టీల్లోకి వలసలు వెళ్లారు. యువతకు ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో వీరభద్రసింగ్ తనయుడు విక్రమాదిత్యకు, మరో మంత్రి కుమారుడికి టికెట్లు ఇచ్చినా పలువురు ఇతర యువజన నేతలకు అవకాశం దక్కలేదు. నవంబరు 12న హిమాచల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. వీరభద్రసింగ్ భార్య ప్రతిభాసింగ్ ఈసారి పార్టీ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈసారి త్రిముఖం : హిమాచల్‌లో సాధారణంగా కాంగ్రెస్, భాజపా మధ్య పోరు సాగుతుంటుంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో దిగడంతో పోటీ త్రిముఖం కానుంది. ఈ పరిస్థితుల్లో భాజపా వ్యతిరేక ఓటు చీలిపోకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు రూ.1,500 చొప్పున చెల్లింపు, పొరుగుసేవల ప్రాతిపదికన పనిచేస్తున్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలు వంటి అంశాలను కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో చేర్చింది. ఒకసారి భాజపాను, తర్వాత కాంగ్రెస్‌ను ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తున్నందున ఆ ప్రకారం చూసినా ఈసారి తమదే అధికారమని హస్తం పార్టీ భావిస్తోంది. 2017 ఎన్నికల్లో 68 స్థానాలకు గానూ భాజపా 44, కాంగ్రెస్ 21 దక్కించుకున్నాయి.